అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు..


అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి విద్యా హబ్‌గా రూపాంతరం చెందే దిశలో ఓ భారీ ముందడుగు పడింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) తన నూతన క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది.

కీలక ఒప్పందం..

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. బిట్స్ పిలానీ సంస్థకు అవసరమైన భూమిని కేటాయించింది. తుళ్లూరు వారి మందడం, వెంకటపాలెం పరిధిలో మొత్తం 70.011 ఎకరాలు కేటాయించింది. ఏపీ సీఆర్డీఏ శుక్రవారం బిట్స్ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య భూ విక్రయ ఒప్పందం ముగిసింది. మొదటి దశలోనే సుమారు రూ.1,000 భారీ పెట్టుబడితో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

క్యాంపస్ విశేషాలు, భవిష్యత్తు ప్రణాళిక..

బిట్స్ అమరావతి క్యాంపస్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దనున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణాన్ని మొత్తం మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. ఒక్కో దశలో అధునాతన సౌకర్యాలను జోడిస్తూ క్యాంపస్‌ను విస్తరిస్తారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో పనిచేసే స్మార్ట్ భవనాలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో, పర్యావరణానికి హాని కలగకుండా నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రపంచ స్థాయి బోధనా శిక్షణను అందిస్తూ స్మార్ట్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. దశలవారీగా 10,000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది.

గడువు, ప్రవేశాలు..

ప్రభుత్వం, బిట్స్ పిలానీ సంస్థ లక్ష్యం ప్రకారం.. 2027 నాటికి నిర్మాణ పనులు మొదటి దశను పూర్తి చేసి, 2027 విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. బిట్స్ పిలానీ వంటి దిగ్గజ సంస్థ రాకతో అమరావతి ప్రాంతంలో అంచనా మార్పులు రానున్నాయి. నిర్మాణ రంగం నుంచి విద్యారంగం వరకు వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

రియల్ ఎస్టేట్ వృద్ధి..

మందడం, వెంకటపాలెం పరిసర ప్రాంతాల మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటూ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న ఎస్ఆర్ఎం (SRM), వీఐటీ (VIT) వంటి సంస్థలతో పాటూ బిట్స్ కూడా చేరడంతో అమరావతి దేశంలోనే ఒక కీలక నాలెడ్జ్ హబ్‌గా మారబోతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కుట్రలు చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్

దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్

తాజాగా చదవండి AP వార్తలు మరియు తెలుగు వార్తలు

నవీకరించబడిన తేదీ – జనవరి 30, 2026 | 09:43 PM



Source link

Spread the love