ఆధునిక వసతులు.. నాణ్యమైన విద్య | general


తెలంగాణ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

మునిపల్లి మండలం లింగంపల్లి గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థులు

తెలంగాణ గురుకుల జూనియర్‌ కళాశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయి. వీటిలో ఇంటర్‌ విద్యతో పాటు.. ఎప్‌సెట్, నీట్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ఇంటర్‌ గురుకులాల్లో 2026-28 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆధునిక తరగతి గదులు.. విశాలమైన మైదానం, నిపుణులైన అధ్యాపక బృందం వీటిలో ఉన్నారు.

7 కళాశాలలు.. 616 సీట్లు

ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో తెలంగాణ గురుకుల జూనియర్‌ కళాశాలలు ఏడు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో ఎంపీసీ, బైపీసీకీ 88 సీట్లు కేటాయించారు. ఇలా నాలుగు జిల్లాల్లోని కళాశాలల్లో 616 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో ప్రవేశ పరీక్ష కోసం మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. http://tgrjc.cgg.gov.in లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. 2025-26 సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 3వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇందులో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా కళాశాలల్లో సీట్లు లభిస్తాయి.

కేటగిరీ వారీగా రిజర్వేషన్లు ఇలా..

గురుకుల జూనియర్‌ కళాశాలల్లో రిజర్వేషన్ల వారీగా సీట్లు కేటాయిస్తారు. జనరల్‌ 50, ఎస్టీ 10, ఎస్సీ 12, బీసీ 15, క్రీడా కోటా 3, పీహెచ్‌సీ 3, ఆర్మ్‌డ్‌ ఒక శాతం, ఈడబ్ల్యూఎస్‌ కింద నాలుగు సీట్లు కేటాయించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ జూనియర్‌ గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతోంది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు ముందుకు రావాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

చైతన్య, గురుకులాల జిల్లా కన్వీనర్, సంగారెడ్డి


కళాశాలలు ఇలా..

  • మెదక్‌: మెదక్‌(బాలికలు) తూప్రాన్‌(బాలురు)
  • సిద్దిపేట: సిద్దిపేట(బాలికలు)
  • సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్‌ మండలం హోతి(కె) (బాలికలు), మునిపల్లి మండలం లింగంపల్లి (బాలురు)
  • వికారాబాద్‌: వికారాబాద్‌ (బాలికలు) తాండూరు(బాలికలు)



Source link

Spread the love