చర్ల, న్యూస్‌టుడే

ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దున ఉండటంతో 2024కు ముందువరకు తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర బిందువు. గడిచిన రెండేళ్లుగా జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ చేయూత’ చక్కటి ఫలితాలు ఇచ్చింది. ఇప్పుడు మావోయిస్టు రహిత జిల్లాగా మారింది. భద్రాద్రి మన్యంలోని చర్ల మండలం రాళ్లాపురానికి చెందిన లక్ష్మీ పొడియం ఒక్కరే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. నక్సల్స్ మిషన్ ముగింపుతో సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు కనుమరుగు కావటంతో భద్రాద్రి జిల్లాలో శాంతి వికసించనుంది.
ఒక్కరు మాత్రమే అజ్ఞాతంలో..
2024కు ముందు చర్ల మండలం నుంచి 20 మంది అజ్ఞాతంలో ఉండేవారు. ‘ఆపరేషన్ చేయూత’లో భాగంగా పోలీసులు మారుమూల గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సత్ఫలితాలను ఇచ్చాయి. ఆదివాసీలకు ఉపాధి బాట చూపటం.. మావోయిస్టు కుటుంబాలకు దగ్గరయ్యేలా మమేకం కావటం.. రోడ్డు, రవాణా సౌకర్యాలతో పాటు పెద్దఎత్తున చేపట్టిన మౌలిక వసతుల కారణంగా 17 మంది జనజీవన స్రవంతిలో కలిశారు. ఇటీవల ఎర్రంపాడుకు చెందిన మడవి అడిమి ఎలియాస్ సంగీత(ఏసీఎం), బాడ్సె యంకా.. డీజీపీ ఎదుట లొంగిపోయారు.
రాళ్లాపురానికి చెందిన లక్ష్మీ పొడియం మాత్రమే ఈనాటికీ ఆయుధం వీడలేదు. ఈమె లొంగుబాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రూ.కోట్లతో సామాజిక కార్యక్రమాలు
ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలోని భద్రాద్రి ఏజెన్సీ మావోయిస్టు కార్యకలాపాలకు అనువుగా ఉండేది. చర్ల, దుమ్ముగూడెం, ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాలు మావోయిస్టుల విధ్వంసాలతో వేడెక్కేవి. ఈప్రాంతాలు మావోయిస్టులకు పెట్టని కోటల్లా ఉండేవి. ఈనేపథ్యంలో భద్రాద్రి జిల్లా పోలీసులు ‘ఆపరేషన్ చేయూత’కు శ్రీకారం చుట్టారు. ఎస్పీ రోహిత్‌రాజు సారథ్యంలో రూ.కోట్ల విలువైన సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎల్‌డబ్ల్యూఈ నిధులతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దును అనుసంధానిస్తూ రహదారుల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రహదారుల నిర్మాణంతో అభివృద్ధికి మార్గం సుగమమైంది. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 359 మంది దళసభ్యులు లొంగిపోయారు. వీరిలో ఏసీఎంలు 34 మంది, పీఎంలు 61 మంది, మిలీషియా సభ్యులు 130 మంది, ఆర్‌పీసీ సభ్యులు 35 మంది, డీఏకేఏఎంఎస్‌లు 47 మంది, సీఎన్‌ఎంలు 31 మంది, జీఆర్‌డీలు 21 మంది ఉన్నారు.
ఈ ఏడాది మావోయిస్టు పార్టీ సప్లయ్ టీమ్-సౌత్‌బస్తర్ డీవీసీ తాటి మూక ఎలియాస్ చూటే లొంగిపోయాడు. ‘బస్తర్’ నక్సల్స్ రహితంగా మారటంతో భద్రాద్రి మన్యంలో మరింత శాంతి వెల్లివిరియనుంది.