ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు | general


దుబ్బాక: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు మరింత ముందుకు రావాలని జిల్లా పాలనాధికారి కె.హైమావతి తెలిపారు. గురువారం దుబ్బాక పురపాలికలోని దుంపలపల్లి శివారులో చింతరాజు అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వరితోపాటు, పంట మార్పిడి విధానంలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకం చేపట్టాలన్నారు. ఎకరా ఆయిల్‌పామ్ సాగుకు రూ.50 వేల వరకు మొక్కలు, డ్రిప్పు, పాండ్ నిర్వహణకు వివిధ రకాలుగా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. మూడేళ్లపాటు ఆయిల్‌పామ్ సాగు చేస్తే.. నాలుగో ఏడాది నుంచి ఆదాయం వస్తుందన్నారు. రైతులందరూ ఆయిల్‌పామ్ సాగుపై మరింత దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి సువర్ణ, దుబ్బాక ఉద్యాన వనాధికారి రమేష్, ఉద్యానవన వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



Source link

Spread the love