ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు, అమెరికా సైనిక దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల భద్రత కోసం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలో గంటగంటకూ మారుత పరిస్థితి.. అక్కడ ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

నోటీసు ఇచ్చే వరకు భారతీయులు ఎవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టెహ్రాన్‌లోని భారత ఎంబాసీ అత్యవసర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నిరసనకారులపై హింసను ఆపకపోతే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని.. సహాయం అందుతుంది అని ట్రంప్ ప్రకటించారు.
ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం నుంచి బీ-52 బాంబర్లు, కేసీ-135 ట్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు నివేదికలు అందజేస్తున్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో గత మూడు వారాలుగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. భద్రతా సైనిక కాల్పుల్లో ఇప్పటివరకు సుమారు 2,500 మంది మరణించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇరాన్‌లో ప్రస్తుతం 180కి పైగా నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. నిరసనకారులకు మరణశిక్షలు అమలు కావడం ఇరాన్ న్యాయశాఖ ఇప్పటికే ప్రకటించడంతో.. ప్రస్తుత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
