తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనూహ్యమైన మార్పులకు లోనవుతుంది. ఫిబ్రవరి మాసంలోనే తెలంగాణలో భానుడి భగభగ మండుతున్నాడు. పగటిపూట తీవ్రమైన ఎండలు, రాత్రిపూట అధిక ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మార్చి నుండి సాధారణంగా పెరిగే ఎండలు ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలు కావడంతో సామాన్యులు బయటకు వెళితే ఇబ్బంది పడుతున్నారు.
ఫిబ్రవరిలోనే గరిష్టంగా ఎండలు
ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇక ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 33 డిగ్రీల నుండి 34.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.

ఈసారి ఎండలు దంచి కొట్టుడే
ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట కూడా కొన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం ఈసారి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఎండలు సాధారణం కంటే ఒక డిగ్రీ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు
ఈ పరిణామంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ఇప్పటికే సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఎండలో బయటకు వెళ్లాలనుకుంటే తెల్లని కాటన్ దుస్తులు ధరించి వెళితే మంచిదని చెబుతున్నారు. ఎండాకాలం శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువగా మంచినీరు తాగాలని, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, తేలికపాటి ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు.