కన్నతండ్రి కళ్ల ముందే.. కానరాని లోకాలకు


ఫిల్మ్‌నగర్‌: ఆ బాలిక పాఠశాల అయిపోయాక సంతోషంగా తండ్రి ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరింది. అంతలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు  కోల్పోయింది. కళ్ల ముందే కుమార్తె బస్సు చక్రం కింద పడి కన్నుమూయడాన్ని తట్టుకోలేక తండ్రి విలపించిన తీరు కలచివేసింది. వివరాల్లోకి వెళితే..  కోనసీమ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్‌  జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.58లోని ఓ భవనంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. వెంగళ్‌రావునగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుమార్తె కీర్తిక(13) 8వ తరగతి, కుమారుడు సాయి 6వ తరగతి చదువుతున్నారు. శనివారం మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలను తండ్రి ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకెళ్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.5 వద్ద ముందున్న  కారు బ్రేకు వేయడంతో ప్రసాద్‌ తన బైకును ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు వారి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. కీర్తిక తలపై నుంచి బస్సు వెనుక చక్రం దూసుకెళ్లడంతో  ప్రాణాలు కోల్పోయింది. తండ్రి, సోదరుడు గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


స్కూటీ ఢీకొని.. మూడేళ్ల బాలుడు..

చర్లపల్లి: బాలుడిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చర్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లిలోని ఈసీనగర్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక శనివారం సాయంత్రం తన ఇంటి సమీపంలోని స్నేహితుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లింది. మిత్రులతో రోడ్డుపై మాట్లాడుతుండగా.. అందులో ఒకరు ఒక్కసారిగా యాక్సిలేటర్‌ ఇచ్చారు. దీంతో ద్విచక్రవాహనం దూసుకెళ్లి ఎదురుగా ఆడుకుంటున్న అజీజ్‌(3)ను ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


మోసపోయాననే బాధతో స్క్రాప్‌ వ్యాపారి ఆత్మహత్య

అమీర్‌పేట: ఇటీవల ఇల్లు అమ్మిన వ్యక్తులు మోసం చేశారన్న మనస్తాపంతో ఓ స్క్రాప్‌ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సార్‌ నగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(42) స్క్రాప్‌ వ్యాపారి. రూ.3.5 కోట్లతో ఇటీవల ఆయన వనస్థలిపురంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటిని కుటుంబసభ్యులకు చూపెట్టడానికి  భార్య, కుమార్తెతో కలిసి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల కిందట నిజాంపేటలోని బావమరిది ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రవీణ్‌ తిరిగి రాలేదు. శనివారం తెల్లవారుజామున ఆయన బేగంపేటలోని రెనెక్సా టవర్స్‌ వద్ద నిర్మాణంలోని ఓ భవనం వద్ద కారును నిలిపి భార్య పేరిట లేఖ రాసి అందులో ఉంచారు. వేరొకరికి చెందిన ఇంటికి నకిలీ పత్రాలు సృష్టించి తనకు విక్రయించి మోసం చేశారని అందులో పేర్కొన్నారు. అలాగే వ్యాపారంలో నగరానికి చెందిన కొందరు సుమారు రూ.6.8 కోట్లు చెల్లించాల్సి ఉందని లేఖలో రాశారు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన లోకేషన్‌ను భార్యకు షేర్‌ చేశారు. అనంతరం అక్కడే ఓ చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.


పెట్టుబడుల పేరిట రూ.86.8 లక్షలు స్వాహా

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ పెట్టుబడుల పేరిట ఒకరి నుంచి రూ.86.8 లక్షలు కొట్టేశారు సైబర్‌ చీటర్లు. ఇరువురి ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీర్‌పేట్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఫిబ్రవరి 25న ఇన్‌స్టాగ్రామ్‌లో స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన లింక్‌తో కూడిన సందేశం వచ్చింది. దాన్ని క్లిక్‌ చేయడంతోనే అతని అనుమతి లేకుండానే బాధితుడి నంబరును ఒక వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చారు. అందులోని సభ్యులు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతున్నామంటూ చాటింగ్‌ చేయడం కనిపించింది. బాధితుడు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుందామని చిన్న మొత్తాలతో ప్రారంభించి విడతలవారీగా రూ.86.8  లక్షలు పెట్టుబడి పెట్టారు. రూ.7 వేలు మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.


ఈ-చలానా అంటూ రూ.4.73 లక్షల బురిడీ

రాయదుర్గం: వాహన ఈ-చలానా పేరిట ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం పంపించిన సైబర్‌ నేరగాళ్లు.. బాధితుడి ఖాతా నుంచి రూ.4.73 లక్షలు తస్కరించారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన రాధాకృష్ణఫోన్‌కు.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందున రూ.వేయి చలానా చెల్లించాలని మెస్సేజ్‌ వచ్చింది. ఆయన వెంటనే అందులోని లింకు ద్వారా తన క్రెడిట్‌కార్డుతో చలానా చెల్లించారు. కొద్దిసేపయ్యాక ఆయన ఖాతాలోంచి రూ.4.73 లక్షలు విత్‌డ్రా అయ్యాయి.



Source link

Spread the love