కవిత Vs కేటీఆర్: రెండేళ్లుగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తీర్పుతో కవిత వర్గం పండుగ చేసుకుంటుంటే, బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడింది. ఇన్నాళ్లూ కేసుల సాకుతో ఆమెను దూరం పెట్టిన పార్టీ పెద్దలకు, ఇప్పుడు క్లీన్ చిట్‌తో బయటపడిన కవితను ఎలా ఎదుర్కోవాలో పాలుపోవడం లేదని కవిత వర్గం చెబుతోంది.
మధ్యేమార్గం మంత్రం.. కేటీఆర్ ట్వీట్‌పై విమర్శలు
కవిత నిర్దోషిగా తేలగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది పార్టీకి వ్యతిరేకంగా జరిగిన కుట్ర అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కవిత వర్గం ఖండిస్తోంది. కవిత అరెస్ట్ అయినప్పుడు కానీ, ఆమె జైల్లో ఉన్నప్పుడు కానీ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదనేది జగమెరిగిన సత్యమని.. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ట్వీట్లు చేస్తారా అంటూ కవిత అనుచరులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
సొంత ఇంటి నుంచే దూరం.. కవిత ఆవేదన
తన కష్టకాలంలో పార్టీ తనను అనాథను చేసిందని కవిత ఇప్పటికే పలుమార్లు సన్నిహితుల వద్ద వాపోయారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై పార్టీ స్పందించకపోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. పార్టీ కోసమే జైలుకు వెళ్లాను.. కానీ పార్టీ మాత్రం తనను కేసుల సాకుతో పక్కన పెట్టింది అని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే బీఆర్ఎస్ పెద్దల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీ పెట్టుకుని తన సత్తా చూపించాలనుకుంటున్నారు.
రెండు నెలల్లో కొత్త పార్టీ
క్లీన్ చిట్‌తో వచ్చిన కొత్త ఉత్సాహంతో కవిత ఇప్పుడు దూకుడు పెంచారు. వచ్చే రెండు నెలల్లో ప్రజల ఆత్మగౌరవం సెంటిమెంట్ ను ఉపయోగించుకునే సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆమె కసరత్తు అందించిన సమాచారం. బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను, తనకు మద్దతుగా ఉన్న కేడర్‌ను ఏకం చేస్తూ ఎవరూ ఊహించని వ్యూహాలతో ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తనపై నిరాదరణ చూపిన వారికి తన రాజకీయ సత్తా చూపడమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. కవిత పుంజుకుంటే ఆ ప్రభావం నేరుగా బీఎస్ ఓటు బ్యాంకుపైనే పడుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆమెకు ఉన్న పట్టు, ఇప్పుడు తోడైన సానుభూతి పవనాలు బీఆర్ఎస్‌ను బలహీనపరిచే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లిన మహిళా నేతను గౌరవించలేకపోయారనే అపవాదు ఇప్పటికే పార్టీపై ఉంది. ఈ నెగిటివ్ నెటిటివ్‌ను కవిత తన కొత్త పెట్టుబడిగా మార్చుకోనున్నారు.
యుద్ధం మొదలైంది!
మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్లీన్ చిట్ అనేది కవితకు కేవలం ఒక న్యాయపోరాట విజయం మాత్రమే కాదు.. ఇది ఆమె రాజకీయ పునర్జన్మకు నాంది. ఇన్నాళ్లూ డిఫెన్స్‌లో ఉన్న కవిత, ఇప్పుడు అటాకింగ్ మోడ్‌లోకి మారడంతో గులాబీ పార్టీలో వణుకు మొదలైంది. మరి తనపై జరిగిన నిరాదరణకు కవిత ఎలాంటి రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి.
ఇంకా చదవండి