ఉప ముఖ్యమంత్రి అన్న పదవి రాజ్యాంగంలో అయితే ఎక్కడా లేదు. మంత్రిగానే వారు ప్రమాణం చేస్తారు ఆ మీదట వారికి ఉప ముఖ్యమంత్రి హోదాని సీఎం ఇస్తారు. అది రాజకీయంగా చేసుకున్న వెసులుబాటుగా చెబుతారు. వారి డిజిగ్నేషన్‌లో ముఖ్యమంత్రి అన్న పేరు ఉంది కాబట్టి వారితో పాటు క్యాడర్ కూడా సంతోషించి సంతృప్తి చెందకుండా ఇదొక సాధనంగా ఉంటోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరవ వేలుగా చెప్పారు. వారికి ఆర్థికపరమైన శక్తి ఉండదు, విధానపరమైన నిర్ణయం తర్వాత తామే అని తీసుకునే వీలు ఉండదు, వారు ముఖ్యమంత్రి వద్ద మిగిలిన మంత్రుల మాదిరిగానే వ్యవహరించాల్సి ఉంటుంది.
కొనసాగుతున్న ట్రెండ్:
గతంలో ఎక్కడో ఒకటీ అరా ఈ పదవులు ఉండేవి. ఇపుడు ఉప ముఖ్యమంత్రుల ట్రెండ్ అయితే అంతటా కొనసాగుతోంది. ఒక విధంగా ఈ పదవికి ఒక అందం ఆకర్షణ కూడా పెరిగింది అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ అని కొన్ని చోట్ల అనుచరులు పొంగుతున్నారు అయితే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమతో పాటు కలసి వెళ్ళడానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు వ్యూహాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయంతోనే ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో చూస్తే ఏపీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఉప ముఖ్యమంత్రుల వ్యవస్థ ఉంది. పంజాబ్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని ఆప్ ఆలోచిస్తోంది.
ఉప ముఖ్యమంత్రులకు బ్యాడ్ టైం :
ఇక డిప్యూటీ సీఎం అనగానే వారితో పాటు అనుచరులు అభిమానులకు కొత్త ఆలోచనలు పుడతాయి. ఇక మీడియా సైతం వారి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కెలుకుతూ ఉంటుంది వారిలో లేని పోని ఆశలను కల్పిస్తూ ఉంటుంది. ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన వరకూ ఇబ్బంది లేకుండానే పనిచేసుకునిపోతున్నారు. కానీ విపక్ష వైసీపీ మాత్రం పవన్ కి ప్రాధాన్యత లేదని అంటోంది. ఇక జనసేనలో కూడా వారికి తగిన అవకాశాలు దక్కడం లేదు అన్న అసంతృప్తి ఉంది అని అంటున్నారు. తెలంగాణాలో భట్టి విక్రమార్క అయితే ఒకింత అసంతృప్తిగా ఉన్నారని ప్రచారంలో ఉంది. సింగరేణి బొగ్గు గనుల టెండర్ విషయంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన కొంత ఆవేదనకు గురయ్యారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో కలసి ముందుకు సాగుతున్నారు కానీ డిప్యూటీ అంటే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అన్న ప్రచారంతోనే కొంత మేర సాగుతోంది.
కుర్చీలాట మొదలు :
కర్ణాటకలో చూసుకుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ కాబోయే సీఎం అని అనుచరులు అంటున్నారు. ఇక సీఎం గా ఉన్న సిద్ధరామయ్య వర్గం అయితే అయిదేళ్ళ సీఎం ఆయనే అని అంటోంది. దీంతో కుర్చీలాట అయితే అక్కడ మొదలైపోయింది. దాంతో ఎవరి ఎమ్మెల్యేలు ఎవరి బలాలు అంటూ లెక్క చూసుకుంటూ మోహరిస్తున్నారు. తమిళనాడులో తండ్రి స్టాలిన్ సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. సో ఇబ్బంది లేదు కానీ ఈసారి గెలిస్తే ఉదయనిధి సీఎం అంటేనే పార్టీలో తేడా వస్తుందని అంటున్న వారూ ఉన్నారు.
మహారాష్ట్రలో సీఎం దేవేందర్ ఫడ్నవీస్ కి ఇద్దరు డిప్యూటీలు ఉన్నారు ఏక్ నాధ్ షిండే ఆ మధ్య దాకా అసంతృప్తిగా ఉన్నా ప్రస్తుతం సర్దుకుని పోతుంటే అజిత్ పవార్ బతికి ఉన్నపుడు కొంత గ్యాప్ మెయిన్ టెయిన్ చేశారు. కానీ ఆయన మరణం తర్వాత సతీమణి సునేత్రా పవార్ కి డిప్యూటీ సీఎం ఇచ్చారు కానీ సజావుగా ఎన్సీపీ బీజేపీ సాగుతాయన్న నమ్మకం కనిపించడం లేదని అంటున్నారు. యూపీలో అదే తీరు సీఎం యోగి ఆదిత్య నాధ్ కి డిప్యూటీ సీఎం కి కొంత గ్యాప్ ఉందని అంటున్నారు. బీహార్ లో నితీష్ సీఎంగా ఉన్నా బీజేపీ కి చెందిన డిప్యూటీ సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ అని అంటున్నారు. దాంతో పార్టీల మధ్య అంతరం మొదలైంది. ఏతా వాతా తేలేది ఏంటయ్యా అంటే డిప్యూటీలు సీఎం చెయ్యి వైపు చూడడం సహజం. కానీ ఇందులో ఏ కొద్ది మందో ఇంకా చెప్పాలంటే ఒకరిద్దరికి మాత్రమే ఆ చేయి దక్కుతుంది. మిగిలిన వారు అంతా బ్యాడ్ టైం అనుకోవాల్సిందే అని అంటున్నారు ఇక డిప్యూటీలతో కొత్త రాజకీయ కేంద్రాలు ఏర్పడుతున్నాయని అంటున్న వారూ ఉన్నారు.