భద్రాచలంలో వైభవోపేతంగా సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం


LIVE FEED

8:44 PM, 26 Mar 2026 (IST)

సునీతా లక్ష్మారెడ్డి వర్సెస్ సీతక్క

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మంత్రి సీతక్క మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోడ్డు వేయలేదని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులు రద్దు చేశారని, అప్పటి బీఆర్ఎస్ ఏ పని చేయలేదని తమపై నిందారోపణలు చేస్తున్నారని ఆమె సభలో మండిపడ్డారు. దీనికి సీతక్క ధీటుగా సమాధామిచ్చారు. తొలి నుంచి తనను బదనాం చేస్తున్నారని, మేం ఏం చేయలేదని అవమానించేలా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క వాపోయారు. ఒక ఆదివాసీ మహిళ మంత్రి కావడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

7:55 PM, 26 Mar 2026 (IST)

భువనగిరిలో ముడేళ్ల బాలుడిపై దాడి చేసి కన్ను పీకేసిన వీధికుక్క

యాదాద్రి జిల్లా: భువనగిరి పట్టణంలో వీధి కుక్క బీభత్సం సృష్టించింది. పట్టణంలో ముడేళ్ల బాలుడిపై దాడి చేసి కన్ను పీకేసింది. ఈ దాడిలో బాలుడికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. సంజీవనగర్‌లోనూ మరో బాలుడిపై వీధి కుక్కల దాడి చేయగా ఆస్పత్రికి తరలించారు.

7:49 PM, 26 Mar 2026 (IST)

మానవ అక్రమ రవాణ కేసులో జగ్గారెడ్డి, కుసుమకుమార్‌కు ఊరట

  • మానవ అక్రమ రవాణ కేసులో జగ్గారెడ్డి, కుసుమకుమార్‌కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై కేసును కోర్టు కొట్టివేసింది. మానవ అక్రమ రవాణ కేసులో ఏ-1గా జగ్గారెడ్డి, ఏ-3గా కుసుమ కుమార్‌పై నేరాలు రుజువు కాలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.

7:49 PM, 26 Mar 2026 (IST)

వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

  • వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది. వెలుగుమట్లలో అర్హులకు పట్టాలు ఇస్తున్నందున ఇప్పుడు స్టే ఇవ్వలేమని పేర్కొంది. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. సీసీఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు వేశారు. అయితే ఇప్పటికే 311 మందికి పట్టాలు ఇచ్చినట్లు జీపీ మురళీధర్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పడంతో ఈ దశలో స్టే ఇవ్వలేమని ధర్మాసనం ప్రకటిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.

7:49 PM, 26 Mar 2026 (IST)

భద్రాచలంలో వైభవోపేతంగా సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం

  • భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా జరుగుతోంది. భద్రాచల పురవీధులు రామనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తరద్వార వేదికపై గరుడవాహనంపై కల్యాణరాముడు ఆశీనులు కాగా, గజవాహనంపై సీతమ్మ ఎదుర్కోలు వేదిక వద్దకు వేంచేసింది. ఈ ఎదుర్కోలు మహోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రేపు మిథిలా మండపంలో శ్రీ సీతారామచంద్రుల తిరుకల్యాణం ఘనంగా జరగనుంది. రేపు సీతారాములకు సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే రూ. 351 కోట్లతో భద్రాచల ఆలయ అభివృద్ధి పనులకు రేపు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

7:49 PM, 26 Mar 2026 (IST)

ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ట్రైబ్యునల్‌కు హైకోర్టు నోటీసులు

  • ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో స్పీకర్​ ట్రైబ్యునల్​తో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్​కుమార్​లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్​ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​ పార్టీలోకి మారిన ఆ ఇద్దరిపై స్పీకర్​ ట్రైబ్యునల్​ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందువల్ల ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. కడియం, సంజయ్​లపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా స్పీకర్​తో ట్రైబ్యునల్​తో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్​కుమార్​కు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఏప్రిల్​ 16కు వాయిదా వేసింది.

6:49 PM, 26 Mar 2026 (IST)

శ్రీరామనవమి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

  • శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు అంక్షలు విధించారు. శోభయాత్ర సాఫీగా సాగేందుకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాతబస్తీ, సెంట్రల్ జోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయిని పోలీసులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు విధించామని పోలీసులు తెలియజేశారు. ఈ శోభయాత్ర సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్‌బజార్ వరకు యాత్ర సాగనుంది. శోభయాత్ర వచ్చే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిలిపివేయనున్నారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని, సాధ్యమైనంత వరకు యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్జప్తి చేశారు.

6:36 PM, 26 Mar 2026 (IST)

ఐపీఎల్‌-2026 రెండో షెడ్యూల్‌ విడుదల

ఐపీఎల్‌-2026 రెండో షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 13 నుంచి మే 24 వరకు జరిగే మ్యాచ్‌ల వివరాలను ఈ షెడ్యూల్​లో విడుదల చేశారు. రెండో షెడ్యూల్‌లో 12 వేదికల్లో 50 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌-2026 ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్​రైజర్స్ హైదరాబాద్​తో పోటీ పడనుంది.

6:31 PM, 26 Mar 2026 (IST)

రాష్ట్రంలో కంపెనీ నడుపుతూ వేరే చోట సీఎస్‌ఆర్ ఫండ్ ఖర్చు చేస్తామంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి

  • రాష్ట్రంలో కంపెనీ నడుపుతూ వేరే చోట కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్​బిలిటీ(సీఎస్‌ఆర్) నిధులు ఖర్చు చేస్తామంటే ఎలా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో సీఎస్‌ఆర్ నిధులపై సమీక్ష నిర్వహించిన ఆయన … కంపెనీలు కనీసం 50శాతం సీఎస్ఆర్‌ నిధులు ఇక్కడే ఖర్చు చేయాలని సూచించారు. రాష్ట్రంలో సీఎస్ఆర్ నిధులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎస్‌ఆర్ నిధుల కోసం ప్రత్యేక వ్యవస్థ, వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని, సీఎస్‌ఆర్ నిధులకు ఇతర రాష్ట్రాల విధానాలు అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

6:24 PM, 26 Mar 2026 (IST)

ఏప్రిల్‌ 2 నుంచి ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్’ ప్రారంభం

  • రాష్ట్రంలో ఏప్రిల్‌ 2 నుంచి ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్’ ప్రారంభం కానుంది. తొలి దశలో 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్​లో ప్రకటించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో అసెంబ్లీలో సమావేశమైన ఆయన భూభారతి పోర్టల్ వివరాలు వెల్లడించారు. తొలిదశ ప్రయోగాత్మక అమలు కోసం కోస్గి, అమన్‌గల్‌, వట్పల్లి, కుసుమంచి, అశ్వారావుపేట మండలాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ అనంతరం దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి సమస్యల పరిష్కార లక్ష్యంతో భూభారతిని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. భూభారతిలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగాల సమగ్ర సమీకరణ జరుగుతుంది. భూవివాదాల తగ్గింపే లక్ష్యంగా భూభారతి పోర్టల్‌ సిద్ధం చేసినట్లు మంత్రి ప్రకటించారు.

5:24 PM, 26 Mar 2026 (IST)

ఏపీలో ఉగ్ర లింకుల కేసులో మరొకరిని అరెస్టు చేసిన పోలీసులు

  • ఏపీలో ఉగ్ర లింకుల కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. విజయవాడ కోర్టులో నిందితుడిని హాజరుపరచగా ఏప్రిల్‌ 6 వరకు విజయవాడ కోర్టు జడ్జి రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు నిందితుడిని రిమాండ్​కు తరలించారు. నిందితుడిని బిహార్‌లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువచ్చారు.

5:24 PM, 26 Mar 2026 (IST)

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు

  • ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ పేరుతో మోసాలు చేస్తున్న మరో ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటనలు ఇస్తూ మోసాలు చేస్తోంది. గ్యాంగ్​ నిర్వహిస్తున్న రాజేష్ వెంకట్రామన్, భమిడిపాటి అభిషేక్, అగస్టీన్, మన్మీత్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా సుమారు రూ.26 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఇటీవల ఒక మహిళ నుంచి నకిలీ పేమెంట్ గేట్‌వే ద్వారా రూ.30 లక్షలు కాజేశారు. క్లోజ్‌ ఎక్స్ పే, ట్రస్ట్‌లీపే, అక్యుల్ట్‌పే ద్వారా డబ్బులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యూల్ ఖాతాలు సృష్టించి నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన పోలీసులు వీరి వద్ద 4 ల్యాప్‌టాప్‌లు, 6 సెల్‌ఫోన్లు, 9 చెక్‌బుక్స్, రూ.6.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

5:24 PM, 26 Mar 2026 (IST)

మొయినాబాద్‌ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ

  • మొయినాబాద్‌ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు కస్టడీ ముగిసింది. దీంతో పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మను కోర్టులో హాజరుపరుచగా రిమాండ్‌ను ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితులను ఈనెల 23న కస్టడీలోకి పోలీసులు తీసుకుని 3 రోజుల పాటు విచారించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా అరెస్ట్ చేసిన డాక్టర్​ను కూడా కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలో కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

4:44 PM, 26 Mar 2026 (IST)

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

  • ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. కొత్త దరఖాస్తులు, రెన్యువల్ గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగిస్తు ఆదేశాలు జారీచేసింది. అనివార్య కారణాలతో 1.25లక్షల విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరి కోసమే ఈనెల 31న ముగియనున్న గడువును ఏప్రిల్ 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

4:29 PM, 26 Mar 2026 (IST)

కార్యాలయాల వేళల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి

  • ఎంఎంటీఎస్ సర్వీసులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని సూచించారు. ముఖ్యంగా కార్యాలయాల వేళల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్ స్టేషన్లకు మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో మెరుగైన వసతులపై కూడా దృష్టి సారించాలని కోరారు.

4:29 PM, 26 Mar 2026 (IST)

మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణపై మరోసారి చర్చించాలన్న ఖర్గే

  • మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణపై మరోసారి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సూచించారు. ఈ మేరకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. అకస్మాత్తుగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు ఎందుకు హడావిడి పడుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

4:29 PM, 26 Mar 2026 (IST)

రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌ భేటీ

  • పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల దేశంలో ఎదురవుతున్న ఇబ్బందులపై రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్​గా భేటీ కానున్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ లభ్యత, రాష్ట్రాల ప్రణాళికలపై ప్రధానమంత్రి సీఎంలతో చర్చించనున్నారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేలా ఈ భేటీ జరగనుంది.

3:49 PM, 26 Mar 2026 (IST)

హార్వర్డ్​లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపోజియం – ఆన్‌లైన్‌లో కీలకోపన్యాసం ఇవ్వనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ రేపు నిర్వహించనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపోజియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆన్‌లైన్‌లో కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. సదస్సులో వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, పరిశ్రమల యాజమాన్యాలు, అకడమిక్ నిపుణులు పాల్గొంటారు. పరిపాలన, ఆర్థిక, మానవీయ అంశాల్లో ఏఐ వినియోగం, ప్రభావంపై సదస్సులో చర్చిస్తారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ లో ఈసదస్సు జరగనుంది. జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి కెన్నెడీ స్కూల్‌లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేశారు. కెన్నెడీ స్కూల్ మాజీ విద్యార్థిగా సదస్సుకు హాజరు కావడంతో పాటు కీలక ఉపన్యాసం ఇవ్వాలని హార్వర్డ్ యూనివర్సిటీ రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున బోస్టన్‌కు వెళ్లడం వీలుకాక ఆన్‌లైన్‌లో కీలకోపన్యాసం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

3:43 PM, 26 Mar 2026 (IST)

జీఎస్టీ సవరణ బిల్లును ఆమోదించిన శాసనసభ

  • జీఎస్టీ సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. సేల్స్ టాక్స్ కమిషనర్ పోస్టును చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్‌గా మార్పు చేశారు. అలాగే అదనపు కమిషనర్ (గ్రేడ్-1) పోస్టును స్టేట్ టాక్స్ కమిషనర్‌గా మార్పు చేసేందుకు సభ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం మిగతా పద్దులతో చర్చ జరుగుతోంది.

3:28 PM, 26 Mar 2026 (IST)

బడ్జెట్ పద్దులపై శాసనసభలో రెండోరోజు చర్చ

  • బడ్జెట్ పద్దులపై శాసనసభలో(Assembly Session) రెండోరోజు చర్చ జరుగుతోంది. పురపాలక, జీఏడీ, న్యాయ, రవాణాశాఖ పద్దులపై చర్చలో అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు. హోం, పంచాయతీరాజ్, బీసీ సంక్షేమశాఖ, మహిళా- శిశుసంక్షేమ శాఖల పద్దులను మంత్రులు ప్రవేశపెడుతున్నారు. ఆరోగ్య శ్రీ, వైద్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆరోగ్య శ్రీ బకాయిలపై నిర్లక్ష్యం ఏమీ లేదని, వైద్య విద్యకు తగినన్ని నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

2:29 PM, 26 Mar 2026 (IST)

హైదరాబాద్​లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై దాడులు

  • హైదరాబాద్​లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ చేస్తున్న కేంద్రంపై హెచ్ పాస్ట్ పోలీసులు దాడులు చేశారు. ముషీరాబాద్ బాపూజీనగర్‌లో నాణ్యతలేని పదార్థాలతో కల్తీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకొని దాడి చేశారు. నిర్వాహకుడు అశోక్‌ను అదుపులోకి తీసుకుని, రూ.1.75 లక్షల విలువైన ఐస్‌క్రీమ్ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్​ఎంసీ, ఫుడ్​ సేఫ్టీ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండానే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

2:19 PM, 26 Mar 2026 (IST)

మామడ పోలీసు క్వార్టర్స్‌లో ఏసీబీ అధికారుల సోదాలు

  • నిర్మల్ జిల్లా మామడ పోలీసు క్వార్టర్స్‌లో ఏసీబీ అధికారులు సోదాలు(ACB Raids) నిర్వహించారు. ఇందులో మామడ ఎస్‌ఐ తీగల అశోక్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఎస్‌ఐ అశోక్ భూవివాదంలో జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వానికి రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ఇవాళ రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

2:06 PM, 26 Mar 2026 (IST)

నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన

  • నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించారు. కనగల్‌లో కొత్తగా నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

2:06 PM, 26 Mar 2026 (IST)

గ్యాస్ కోసం లక్డీకాపుల్​ కూడలిలో ఆటో డ్రైవర్ల ధర్నా

  • లక్డీకాపుల్ కూడలిలో ఉన్న గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించారు. రెండు రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే సైఫాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

1:37 PM, 26 Mar 2026 (IST)

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,800

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఇవాళ్టి ధర రూ. 1,50,800. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,34,650. కిలో వెండి ధర రూ.2,43,000 గా ట్రేడవుతోంది.

1:11 PM, 26 Mar 2026 (IST)

పరిశ్రమలకు భూములు ఇవ్వలేమంటూ పరిగి జాతీయరహదారిపై రైతుల ఆందోళన

  • పరిశ్రమలకు తమ పంట భూములు ఇవ్వలేమంటూ వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ వద్ద జాతీయరహదారిపై కాళ్లపూర్ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయరహదారిపై రైతులు బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. పరిశ్రమల కోసం తమ పొలాలను పరిశ్రమల కోసం లాక్కోవద్దంటూ వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయరహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వివాదం జరిగి తోపులాటకు దారితీసింది. తమకు స్పష్టమైన హామీ కావాలని, కలెక్టర్ వచ్చేంతవరకు కదిలేది లేదంటూ ఆడ మగ రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్​కి తరలించే ప్రయత్నం చేయగా మిగతా రైతులు పోలీస్ వాహనానికి అడ్డుతగిలారు.

1:05 PM, 26 Mar 2026 (IST)

అత్తామామలు గౌరవం ఇవ్వడం లేదని ఏడేళ్ల బావమరిదిని చంపిన బావ

  • అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారి వేమ్ చంద్రకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన బావ బోయ సర్వేశ్ దారుణంగా హత్య చేశాడు. నిన్న పాఠశాల నుంచి వస్తుండగా బాలుడిని తన వెంట తీసుకెళ్లాడు. తమ కుమారుడు కనిపించడంలేదని తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టగా హత్య విషయం వెలుగుచూసింది. బాలుడిని బోయ సర్వేశ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్దరించారు. చిన్నారి వేమ్ చంద్ర అక్కను వివాహం చేసుకున్న బోయ సర్వేశ్, ఉగాదికి భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. అయితే తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని అత్త, మామలపై కక్ష పెంచుకున్న బోయ సర్వేశ్, నిన్న వేమ్​ చంద్రను హత్య చేశాడు.

12:52 PM, 26 Mar 2026 (IST)

నిరంతరంగా పెట్రోల్‌, డీజిల్ సరఫరా చేస్తున్నాం : స్టీఫెన్ రవీంద్ర

  • పశ్చిమాసియా యుద్ధం దృష్ట్యా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, స్టాక్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్న స్టీఫెన్‌ రవీంద్ర, నిరంతరంగా పెట్రోల్‌, డీజిల్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.28 కోట్ల ఎల్పీజీ గృహ కనెక్షన్లు ఉన్నాయని, వాటి సరఫరాలో ఎలాంటి లోటు లేదన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని 592 ఔట్‌లెట్స్​లో పరిస్థితి సాధారణంగానే ఉందని, సామాజిక మాధ్యమాల్లో వదంతులకు ప్రజలు ఆందోళన చెందవద్దని స్టీఫెన్ రవీంద్ర సూచించారు.

12:37 PM, 26 Mar 2026 (IST)

‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయి’

  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. తాము చేపట్టిన ఆసుపత్రుల గురించి చెప్పారు కానీ పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆసుపత్రులు ఎప్పుడో పూర్తయ్యేవని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 2014 జూన్ రెండో తేదీ వరకు ఆరోగ్య శ్రీకి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అయ్యేవని 2023 వరకు ఆ ఖర్చు రూ.68 కోట్లకు పెరిగిందని, ఇవాళేమో రూ.89 కోట్లు అంటున్నారని, ఇందులో సహజ పెరుగుదల ఉందే కానీ కొత్తగా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. సీఎంఆర్ఎఫ్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని, ఈ అంశాలు అన్నీ చెప్పాలని అనుకుంటే సభలో తమకు మైక్ ఇవ్వలేదన్నారు.

11:55 AM, 26 Mar 2026 (IST)

విదేశాల్లో నిపుణులైన వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలనుకుంటుంన్నాం : సీఎం రేవంత్‌రెడ్డి

  • విదేశాల్లో నిపుణులైన వైద్యుల సేవలను మా ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభుత్వం నుంచి వచ్చాయని సీఎం తెలిపారు. ప్రతి నెల సగటున రూ.89 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.240.11 కోట్లు ప్రైవేటు ఆస్పత్రులకు రూ.360.16 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.2408.51 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. దీనిలో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు చెల్లించామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేశారు. గతంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.2046 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ చేశామన్నారు. 27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు చెల్లించామని అన్నారు. టీచింగ్‌ కాలేజీలకు రోగులు వెళ్లట్లేదన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్‌ 1 అధికారులకు అప్పగిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకువచ్చామని తెలిపారు.

11:48 AM, 26 Mar 2026 (IST)

హైదరాబాద్‌లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు

  • ఇవాళ హైదరాబాద్‌లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు జరగనుంది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన సదస్సు ఉంటుంది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, కేరళ, పుదుచ్చేరి, అండమాన్- నికోబార్ దీవులు, లక్షద్వీప్ అధికారులు పాల్గొననున్నారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అమలు, పూడికతీతపై సదస్సులో చర్చ జరగనుంది. వర్షపు నీటి సంరక్షణ, పరివాహక ప్రాంత నిర్వహణపై చర్చిస్తారు. భూగర్భ జలాలు తోడడం, ఫ్లడ్ ప్లానింగ్ జోన్ మార్గదర్శకాలపై చర్చ జరుపుతారు. శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం తదితర అంశాలపై చర్చ ఉంటుంది. దీనిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పరిస్థితిపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

11:45 AM, 26 Mar 2026 (IST)

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఆరుగురు మహిళా కూలిలకు గాయాలపాలయ్యారు.

11:10 AM, 26 Mar 2026 (IST)

మార్కాపురం ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్​లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అత్యంత విషాదకరమన్నారు. క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

10:40 AM, 26 Mar 2026 (IST)

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దావోస్ పర్యటనల్లో 44 ఎంవోయూలు ప్రభుత్వం కుదుర్చుకుందని, పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. 2024 దావోస్‌లో 18 ఎంవోయూలు రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2025 దావోస్‌లో 26 ఎంవోయూలు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయింపు జరిగిందని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. మరో 3 కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూముల గుర్తింపు జరిగిందని చెప్పారు. నిజామాబాద్‌లో 681 సీట్ల సామర్థ్యంతో ఐటీ టవర్ నిర్మించామన్న మంత్రి, ఐటీ టవర్‌లో 11 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అందులో ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.

10:17 AM, 26 Mar 2026 (IST)

బ‌స్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి – సీఎస్​కు కీలక ఆదేశాలు

మార్కాపురం జిల్లాలో బ‌స్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఏపీ అధికారుల‌తో మాట్లాడాల‌ని సీఎస్‌ను ఆదేశించారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన సీఎం, మృతుల కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ప్రమాద ఘటనలో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవాలని, ఏపీ అధికారుల‌తో మాట్లాడి పూర్తి వివ‌రాలు సేక‌రించాల‌ని సీఎస్​కు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సీఎస్‌ రామ‌కృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు.

9:24 AM, 26 Mar 2026 (IST)

ఏపీకి చెందిన తాపీ మేస్త్రీలు, కూలీలు వేలాది మంది జగిత్యాల జిల్లాలో నివాసం

ఏపీలోని మార్కాపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో జగిత్యాల నుంచి ట్రావెల్స్ బయలుదేరగా జగిత్యాలలో ఏపీకి చెందిన మనోహర్, ప్రభావతి ఇక్కడ బస్సులో బయలుదేరారని నిర్వాహకులు తెలిపారు. నెల్లూరుకు చెందిన హరికృష్ణ అనే ట్రావెల్స్ ప్రతిరోజు జగిత్యాలకు వచ్చి ఇక్కడ ప్రయాణికులను తీసుకొని వెళ్తుంది. ఏపీకి చెందిన తాపీ మేస్త్రీలు, కూలీలు వేలాది మంది జగిత్యాల జిల్లాలో ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారి కోసమే ప్రతిరోజు కోరుట్ల జగిత్యాల నుంచి ప్రయాణికులు ఏపీ రాష్ట్రానికి రాక పోకలు సాగిస్తున్నారు. అయితే కోరుట్ల నుంచి ఇద్దరు, జగిత్యాల నుంచి ఇద్దరు బస్సులో బయలుదేరినట్లు ఇక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు తెలిపారు.

9:21 AM, 26 Mar 2026 (IST)

మార్కాపురం బస్సు ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి

మార్కాపురంలోని రాయవరం పలకల క్వారీ వద్ద ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో 13 మంది దుర్మరణంపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ యుద్ధ ప్రాతిపదికన మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

9:02 AM, 26 Mar 2026 (IST)

బస్సు కండిషన్‌ సరిగా లేదని డ్రైవర్‌తో ముందుగానే చెప్పిన ప్రయాణికులు

యాక్సిడెంట్ అప్​డేట్​ :

ఆంధ్రప్రదేశ్​లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు టిప్పర్‌ను ఢీకొంది. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, 13 మంది సజీవ దహనమయ్యారు. ప్రయాణికులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 గురు ఉన్నట్లు సమాచారం. బస్సు కండిషన్‌ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్‌తో చెప్పారు. యర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు జగిత్యాల ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. జీవనోపాధి కోసం జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలో వచ్చి గృహ నిర్మాణ పనుల్లో పాల్గొంటారు.

8:34 AM, 26 Mar 2026 (IST)

మార్కాపురం ప్రమాద ఘటన – 13కు చేరిన మృతుల సంఖ్య

యాక్సిడెంట్ అప్​డేట్​ :

ఆంధ్రప్రదేశ్​లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు టిప్పర్‌ను ఢీకొంది. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉండగా, మంటలు చెలరేగగానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 మంది సజీవ దహనం కాగా, చనిపోయిన వారు కనిగిరి, పామూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

7:50 AM, 26 Mar 2026 (IST)

ఘోర ప్రమాదం – 10 మంది సజీవదహనం

ఆంధ్రప్రదేశ్​లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు టిప్పర్‌ను ఢీకొంది. ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, 10 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్న అధికారులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు.

6:54 AM, 26 Mar 2026 (IST)

నేటి నుంచి అందుబాటులోకి రానున్న సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు శుభవార్త చెప్పింది. నేటి నుంచి సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌ 5న సన్‌రైజర్స్, లఖ్‌నవూ మధ్య ఉప్పల్‌లో తొలి మ్యాచ్‌ జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 గం.కు సన్‌రైజర్స్, లఖ్‌నవూ మ్యాచ్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. డిస్ట్రిక్ట్‌ యాప్‌లో అభిమానులు కొనుక్కోవచ్చని ఫ్రాంఛైజీ పేర్కొంది. ప్రతి రెండు టికెట్లకు ఒక సన్‌రైజర్స్‌ జెర్సీని ఉచితంగా పొందొచ్చని ఫ్రాంఛైజీ వెల్లడించింది.

6:52 AM, 26 Mar 2026 (IST)

నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ

నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో ప్రధాన నిందితుడిగా నీరవ్ మోదీ తనను భారత్‌కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు వేశారు. నీరవ్ మోదీ దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టే పరిస్థితులు కనిపించడం లేదని ధర్మాసనం తెలిపింది. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పంజాన్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. వేల కోట్లు తీసుకొని ఎగవేసినట్లు ఆరోపణలు చేశారు.

6:51 AM, 26 Mar 2026 (IST)

నేటి నుంచి కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సీతారాముల కల్యాణానికి టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది.

6:49 AM, 26 Mar 2026 (IST)

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. రాజమండ్రి, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు నుంచి భద్రాచలంకు బస్సులు నడపనుంది. నేటి నుంచి ప్రతి గంటకు ప్రత్యక బస్సులు నడపనున్న ఆర్టీసీ వెల్లడించింది. భద్రాచలం, పరిసర క్షేత్రాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రయాణికులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంచింది.

6:48 AM, 26 Mar 2026 (IST)

భద్రాచలం రామాలయం పునరాభివృద్ధికి రూ.351 కోట్లు మంజూరు

భద్రాచలం రామాలయం పునరాభివృద్ధికి ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనులకు తొలివిడత నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.586 కోట్లతో 3 దశల్లో రామాలయం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది.



Source link

Spread the love