అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనని అమెరికా ప్రభుత్వం భారత్‌పై ఓ వైపు టారిఫ్ హెచ్చరికలు చేస్తూనే.. మరోవైపు ఇంధన రంగంలో భారీ ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. వెనిజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు సంబంధించి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెనిజులపై ఉన్న ఆంక్షల కారణంగా నిలిచిపోయిన చమురు దిగుమతులను భారత్ తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై 500 శాతం టారిఫ్ విధిస్తామని ఒకరోజు ముందే చరించిన ట్రంప్.. ఇప్పుడు వెనిజులా చమురు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడం. వెనిజులా చమురుకు భారత్ ఒకప్పుడు అతిపెద్ద మార్కెట్ గా ఉండేది. ఇప్పుడు ఈ నిర్ణయంతో మళ్లీ పాత సంబంధాలు చిగురిస్తున్నాయి.
అమెరికా పెట్టిన నిబంధనలు ఏమిటి?
అయితే వెనిజులా చమురు విక్రయాల విషయంలో అమెరికా కఠినమైన షరతులను విధించింది. అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్టోఫర్ రైట్ తెలిపిన వివరాల ప్రకారం.. వెనిజుల నుండి చమురు విక్రయాలు పూర్తిగా అమెరికా ప్రభుత్వం పర్యవేక్షణలోనే జరుగుతాయి. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం అమెరికాలో ఉన్న బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది. ఆ నిధులను వెనిజులలోని అవినీతి పరులకు లేదా పాత పాలకులకు అందకుండా, కేవలం అక్కడి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేసేలా అమెరికా జాగ్రత్తలు తీసుకోనుంది.
ప్రపంచ మార్కెట్‌లో వెనిజుల క్రూడాయిల్ క్రేజ్
వెనిజులలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. అమెరికా రిఫైనరీలతో పాటు యూరోప్, ఆసియా దేశాలకు కూడా వెనిజులా ముడి చమురు అవసరం చాలా ఉంది. ముఖ్యంగా భారత్‌లో ఉన్న భారీ రిఫైనరీలు వెనిజులకు చెందిన ‘హెవీ క్రూడ్ ఆయిల్’ను శుద్ధి చేయడానికి అనుకూలంగా రూపొందించబడింది. ఇప్పుడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వెనిజులా చమురు అంతర్జాతీయ మార్కెట్‌లోకి విరివిగా అందుబాటులోకి రానుంది. ఇది అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడానికి కూడా దోహదపడవచ్చు.
భారత వ్యూహాత్మక ప్రయోజనం
రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో అమెరికా ఒత్తిడి పెరుగుతున్న వేళ.. వెనిజుల రూపంలో భారత్‌కు మరో ప్రత్యామ్నాయం దొరికినట్లయింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం వివిధ దేశాలపై ఆధారపడుతోంది. వెనిజులా నుంచి చమురు దిగుమతులు మళ్లీ ప్రారంభమైతే, భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా, ఇతర దేశాలతో బేరసారాలు ఆడే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.