భారాస సోషల్‌ మీడియాలో తప్ప ఎక్కడా లేదు


భాజపా పుంజుకొనే అవకాశమే లేదు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అధిష్ఠానం పెద్దలను కలవడానికి దిల్లీ వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘ఓవైపు భారాస పనైపోయింది. మరోవైపు భాజపా పుంజుకొనే పరిస్థితి లేదు. కవిత భారాస నేతల బండారాన్ని బయటపెడుతూ వస్తున్నారు. ఆ పార్టీ నాయకుల గురించి ఆమె చెబుతున్నవన్నీ నిజాలే. వాటికి భారాస నాయకులు ఏం సమాధానం చెబుతారు? సృజన్‌రెడ్డిని ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన్ను పెంచి పోషించిందే కవిత, హరీశ్‌రావు. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఉపేందర్‌రెడ్డిని క్విడ్‌ప్రోకో కింద భారాసలో చేర్చుకున్నది వారే. ఆయన అల్లుడు సృజన్‌రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చింది కూడా గత భారాస ప్రభుత్వమే. భారాసను నడపడం ఆ నాయకులకు చేతకావడం లేదు. కేటీఆర్‌ సోషల్‌ మీడియాను పట్టుకొని పాకులాడుతున్నారు. అందుకే భారాస సామాజిక మాధ్యమాల్లో తప్పితే ఎక్కడా కనిపించడం లేదు. కార్పొరేషన్‌ ఎన్నికలకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా కరవయ్యారు. భాజపా కూడా తెలంగాణలో పుంజుకొనే అవకాశం లేదు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైనప్పుడు నైనీ కోల్‌బ్లాక్‌ ప్రస్తావనే రాలేదు. ‘నైనీబ్లాక్‌ పంచాయితీ’ అంతా మీడియా సృష్టే తప్పితే అందులో ఏమీలేదు. డీసీసీ నియామకాలకు సంబంధించి ఇంకా రెండు డీసీసీ ప్రెసిడెంట్లు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి ఎంపిక పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే భర్తీ చేస్తాం’’ అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. మీనాక్షీ నటరాజన్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ప్రచారం అవాస్తవమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.



Source link

Spread the love