
ఆసీస్ గండాన్ని దాటి టీమ్‌ఇండియా(టీమ్ ఇండియా).. సెమీస్ నుంచి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో కొండంత లక్ష్యాన్ని (339) ఛేదించి.., దక్షిణాఫ్రికాతో తుదిపోరుకు సిద్ధమైంది. టోర్నీలో మొదట తడబాటుకు గురైనా.. తర్వాత తేరుకొని.. ఆఖరుకు ఫైనల్‌కు చేరుకున్న టీమ్‌ఇండియా ప్రస్థానం థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఇక క్లైమాక్స్‌లో కప్ కొట్టి.. శుభం కార్డు వేయడమే తరువాయి.
ఉత్సాహంతో ఒకరు.. ఆనందంతో మరొకరు!
మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (నవంబరు 2) నవీముంబయి వేదికగా జరగనుంది. తుదిపోరులో టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీఫైనల్‌లో ఆసీస్‌ను మట్టి కరిపించిన ఉత్సాహంతో టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఆనందంలో దక్షిణాఫ్రికా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ రెండు జట్లలో ఏది గెలిచినా.. ఆ టీమ్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్నట్లవుతుంది.
టీమ్‌ఇండియాదే పై చేయి!
టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్లలో ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. టీమ్‌ఇండియా 20 సార్లు విజయం సాధిస్తే, దక్షిణాఫ్రికా 13 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే.. ప్రస్తుత వరల్డ్ కప్‌లో (2025) అక్టోబర్ 9న విశాఖపట్నం వేదికగా ఇరుజట్లకు జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా జట్టు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
భారత జట్టు బలంగా ఉంది..
ప్రస్తుతం టీమ్ ఇండియా కూర్పు బాగుంది. ఓపెనర్ స్మృతి మంధాన మంచి టచ్‌లో ఉంది. ఆమె ఇప్పటివరకు టోర్నీలో ఎనిమిది మ్యాచుల్లో 389 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ గాయానికి గురైన ప్రతీక రావల్ జట్టుకు దూరమైంది. ఆమె స్థానంలో షెఫాలీ వర్మ వచ్చింది. సెమీస్‌లో ఆమె పెద్దగా పరుగులు చేయనప్పటికీ.. క్రీజులో ఉన్నంతవరకు మంచి రిథమ్‌లోనే కనిపించింది. ‘లేడీ సెహ్వాగ్’గా పేరున్న ఆమె ఫైనల్‌లో సౌతాఫ్రికాపై విజృంభించే అవకాశం ఉంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రాణిస్తోంది. ఇప్పటి వరకు ఏడు పరుగులలో ఆమె 240 పరుగులు చేసింది. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. జట్టుకు దూరమై తిరిగి మధ్యలో దక్కించుకున్న జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో ఫామ్‌లోకొచ్చింది. ఆ శతకంతో ఆమె సెమీస్‌లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా నెగ్గడంలో కీలకపాత్ర పోషించింది. బౌలింగ్ సంస్థనూ టీమ్‌ఇండియా బలంగానే ఉంది. దీప్తిశర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా, ఆల్‌రౌండర్ అమన్ జ్యోత్ కౌర్‌తో బౌలింగ్ యూనిట్ సమతూకంగా ఉంది.
తక్కువగా అంచనా వేయలేం..
సౌతాఫ్రికా కెప్టెన్, ఓపెనర్ బ్యాటర్ లారా వోల్‌వార్డ్ ఈ టోర్నీలో భీకరమైన ఫామ్‌లో ఉంది. ఆమె 8 ఇన్నింగ్స్‌లో 470 పరుగులు సాధించి, అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆమె మూడు హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ (169). అలాగే తజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్ మంచి టచ్‌లో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో వీరిని ఎక్కువ పరుగులు చేయాలంటే త్వరగా టీమ్‌ఇండియా క్రికెటర్లు పెవిలియన్‌కు పంపాల్సి ఉంటుంది. ఏ అవకాశం చిక్కినా వీరు మన నుంచి మ్యాచ్‌ను దూరంగా తీసుకెళ్లిపోతారు. క్రమశిక్షణగా లైన్ అండ్ లెన్త్ బంతులతో మన బౌలర్లు విరుచుకుపడితే అదేం అసాధ్యం!
కష్టం.. కష్టం.. అనుకున్న ఆసీస్ మీదే.. భారీ స్కోర్‌ను ఛేదించి మరీ టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. అదే ఊపుతో ఫైనల్‌లోనూ సౌతాఫ్రికాను ఓడించి తొలిసారిగా వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.
– ఇంటర్నెట్ డెస్క్