మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు లింకు పెడుతున్నారు?: సీఎం


LIVE FEED

10:54 PM, 10 Apr 2026 (IST)

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు: సీఎం రేవంత్‌రెడ్డి

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అతివలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. స్థానికసంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిందే రాజీవ్‌గాంధీ అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మహిళా బిల్లును సోనియాగాంధీ గతంలోనే పార్లమెంటులో పెట్టారన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు లింకు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతమున్న 543లో కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చన్నారు. ప్రస్తుత సీట్లతోనే మహిళా రిజర్వేషన్‌ అమలు చేస్తే ఎవరూ అడ్డుపడరని వివరించారు. ఉత్తర- దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచాలని బీజేపీ చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్థిక అంతరాలతో ఇప్పుడు రాజకీయ అంతరం తీసుకువస్తున్నారని ఆక్షేపించారు. ఎన్డీఏ చెప్తున్న లెక్కలు ఉత్తర- దక్షణాది మధ్య పెద్ద అంతరం పెంచనున్నాయన్నారు. ఐదు రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది బీజేపీ ఆలోచన అని రేవంత్ రెడ్డి అన్నారు.

10:50 PM, 10 Apr 2026 (IST)

శంషాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య

శంషాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టేకాఫ్ తీసుకునే సమయంలో ఇంజిన్‌లో సమస్యను పైలెట్ గుర్తించారు. దీంతో మధ్యాహ్నం 3.15 గం. నుంచి శంషాబాద్‌లోనే ప్రయాణికుల పడిగాపులు కాశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాధానం కూడా చెప్పట్లేదని స్పైస్‌జెట్‌ సిబ్బందిపై ప్రయాణికుల మండిపడ్డారు.

10:48 PM, 10 Apr 2026 (IST)

త్వరలోనే జగిత్యాలలో సభ పెట్టి బీఆర్‌ఎస్‌లో చేరతాను: జీవన్‌రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్​తో జీవన్​రెడ్డి ఐదు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం జీవన్​రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టుకోల్పోయిందని విమర్శించారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్లుగా సీఎం నడుచుకునేవారని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చెబితే పీసీసీ అమలు చేస్తోందన్నారు. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతానని జీవన్​రెడ్డి తెలిపారు. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తోందన్నారు.

7:52 PM, 10 Apr 2026 (IST)

సైబరాబాద్ పరిధిలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

  • సైబరాబాద్ పరిధిలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ట్రైనింగ్‌ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. సుమారు 452మంది నుంచి క్యామెల్‌ ఐక్యూ సొల్యూషన్స్ డబ్బు వసూలు చేసింది. ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ.80 వేల వరకు వసూలు చేశారు. కొన్నాళ్లు వేతనాలు ఇచ్చి తర్వాత ఆపేసింది. దీంతో
    క్యామెల్ ఐక్యూ సంస్థపై మాదాపూర్ పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేయగా ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

7:52 PM, 10 Apr 2026 (IST)

ఈ ఏడాది ప్రధాని మోదీ గిరిజన వర్సిటీకి భూమి పూజ చేస్తారు: కిషన్‌రెడ్డి

  • ఈ ఏడాది ప్రధాని మోదీ గిరిజన వర్సిటీకి భూమి పూజ చేస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర గిరిజన వర్సిటీని ముందు మహబూబ్‌నగర్‌లో పెట్టాలనుకున్నాం, కానీ కేంద్రం ములుగులోనే గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తుందని వివరించారు. సమ్మక్క-సారలమ్మ గిరిజన వర్సిటీ – ఐఐటీ హైదరాబాద్‌ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

6:31 PM, 10 Apr 2026 (IST)

10రోజుల్లో జగిత్యాలలో భారీ బహిరంగ సభ – కేసీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లోకి జీవన్‌రెడ్డి

  • జగిత్యాలలో 10రోజుల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, అందులోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్​లోకి చేరతారని ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్‌ ప్రకటించారు. సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి గులాబీ కండువ కప్పుకోనున్నారు. బీఆర్‌ఎస్‌ ప్లీనరీ కంటే ముందే జగిత్యాల సభ ఉంటుందని కొప్పుల తెలిపారు. కేసీఆర్‌తో మమేకమై జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేస్తారని కొప్పుల ఈశ్వర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

6:28 PM, 10 Apr 2026 (IST)

నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని అమ్ముకున్న తల్లిదండ్రులు

  • నాలుగో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని శిశువును అమ్ముకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. బాన్సువాడలోని ఎల్లారెడ్డి మం. బ్రాహ్మణపల్లికి చెందిన శివయ్య, కిష్టవ్వకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. నాలుగోసారీ ఆడపిల్లే పుట్టడంతో బీర్కూర్ మం. దామరంచకు చెందిన దంపతులకు రూ. లక్షకు విక్రయించారు. స్థానికుల ఫిర్యాదుతో అమ్మకం ఘటన వెలుగులోకి వచ్చింది.

5:16 PM, 10 Apr 2026 (IST)

మథురలో పడవ ప్రమాదం, 10 మంది మృతి

  • ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మథురలో జరిగిన పడవ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. యమున నదిలో పడవ బోల్తా పడగా 10మంది చనిపోగా పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 25 మంది ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సహాయసిబ్బంది నదిలోంచి 10 మృతదేహాలు వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

4:54 PM, 10 Apr 2026 (IST)

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరోసారి కస్టడీ

  • మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరోసారి కస్టడీకి కోర్టు అంగీకరించింది. పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేశ్‌ రెడ్డి, దిల్లీకి చెందిన వ్యాపారి నమిత్‌ శర్మను మరోసారి 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. పరిశీలించిన రాజేంద్రనగర్ కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది.

4:35 PM, 10 Apr 2026 (IST)

సంగారెడ్డిలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

  • సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో న్యూట్రల్ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల తీవ్రతకు తోడు రసాయనాలు మండి నల్లటి పొగ చుట్టుపక్కల దట్టంగా అలుముకుంది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పొగలు ఎగిసిపడుతున్నాయి. మరోపక్క పారిశ్రామిక వాడలోని నాలుగు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీగా మంటలు, నల్లటి పొగతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

4:35 PM, 10 Apr 2026 (IST)

కాచిగూడలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

  • హైదరాబాద్‌ కాచిగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. సోషల్ మీడియాలో పరిచయమైన 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. దాడి చేసింది కూడా మైనర్(15) కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు పరిచయమైన 15 ఏళ్ల బాలుడు, ఆమెతో స్నేహం పెంచుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. లైంగికదాడి కేసులో బాలుడిని పోలీసులు జువైనల్‌హోమ్‌కు తరలించారు.

3:42 PM, 10 Apr 2026 (IST)

తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు

  • తెలంగాణ డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో 11 మంది పీఎల్‌జీఏ బెటాలియన్‌ సభ్యులు ఉన్నారు. బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు. సోది కేశాలు లొంగుబాటును పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. సుమారు 40 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులకు సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌ మావోయిస్టులు ఉన్నారు. ఆపరేషన్ ఖగార్ గడువు ముగియడంతో ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ పెరిగింది. దీంతో నక్సల్స్ తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణ వాసి ఉన్నారని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ.1.93 కోట్లు అందజేస్తున్నామని డీజీపీ ప్రకటించారు.

3:15 PM, 10 Apr 2026 (IST)

కేసీఆర్‌తో సమావేశమైన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

  • గులాబీ బాస్ కేసీఆర్‌(KCR)తో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్​లో ఈ భేటీ జరిగింది. ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన ఆయన నిన్న బీఆర్​ఎస్​లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత తొలిసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీలో చేరిక తేదీ, ఇతర అంశాలపై జీవన్‌రెడ్డితో కేసీఆర్ చర్చించారు.

2:57 PM, 10 Apr 2026 (IST)

జననాయగన్ లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది: చిరంజీవి

  • జననాయగన్ సినిమా దృశ్యాలు లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chirangevi) స్పందించారు. జననాయగన్ లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. లీక్‌, పైరసీ ఘటనలు పరిశ్రమలో అందరిని ప్రభావితం చేస్తాయని, సినిమాను కాపాడుకోవడం మనందరి బాధ్యతగా తీసుకుందామని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పైరసీని అరికడదాం, సినిమాను కాపాడుకుందాం అని చిరంజీవి సూచించారు. జననాయగన్ చిత్రంలోని 5 నిమిషాల వీడియో, ఓ పాటను దుండగలు లీక్ చేశారు. జననాయగన్ సన్నివేశాల లీక్‌పై ఇప్పటికే నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

2:53 PM, 10 Apr 2026 (IST)

కడప జిల్లా ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం

  • ఏపీలోని కడప జిల్లా ఖాజీపేటలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని ప్రేమోన్మాది యువతి గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు కోరుతున్నాయి.

2:50 PM, 10 Apr 2026 (IST)

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దేశవ్యాప్త కార్యక్రమాలకు బీజేపీ సిద్ధం

  • మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దేశవ్యాప్త కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఈ బిల్లు గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. బిల్లు ఆమోదం తర్వాత కూడా పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసమే అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాంచందర్‌రావు, మాధవ్‌ కూడా హాజరయ్యారు. 2029 ఎన్నికల నుంచి అమలయ్యేలా చట్టంలో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది.

12:55 PM, 10 Apr 2026 (IST)

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు

  • హైదరాబాద్‌లో హయత్‌నగర్‌ కుంట్లూరులో హైడ్రా (Hydra demolitions) కూల్చివేతలు చేపట్టారు. అంజనాద్రినగర్‌లోని 204 సర్వే నంబర్‌లో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు జరుగుతున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

12:45 PM, 10 Apr 2026 (IST)

హనుమకొండ జిల్లాలో భార్య, కుమార్తెల హత్య కేసులో పురోగతి

  • హనుమకొండ జిల్లాలో భార్య, కుమార్తెల హత్య కేసులో పురోగతి. ఈ హత్య కేసులో భర్త, మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బాల్నె పూర్ణిమ, ఎస్.రవళి ఇద్దరు వైద్యులు పరారీలో ఉన్నారు. ఆడపిల్లలు పుడుతున్నారని గర్భవతిగా ఉన్న భార్యను అజారుద్దీన్ ఈతకొలనులో తోసి చంపేశాడు. గతంలో కూడా భార్యకు రెండుసార్లు అబార్షన్ అజారుద్దీన్ చేయించాడు.

12:45 PM, 10 Apr 2026 (IST)

హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన కేసులో బాధితురాలు ఆత్మహత్య

  • హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన కేసులో బాధితురాలు ఆత్మహత్య పాల్పడింది. ఇంట్లో ఉరి వేసుకుని యువతి దుర్మరణం. ప్రస్తుతం నిందితుడు మనోహర్ జైలులో ఉన్నాడు. పెళ్లికి నిరాకరించిందని గత నెల 11న యువతికి హెచ్‌ఐవీ రక్తాన్ని (HIV Blood) ఎక్కించిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది.

12:27 PM, 10 Apr 2026 (IST)

గొల్లపల్లి ప్రాజెక్టును కాసుల కోసమే కడుతున్నారని మమ్మల్ని విమర్శిస్తున్నారు : జూపల్లి

  • గొల్లపల్లి ప్రాజెక్టు (Gollapalli Project)ను కాసుల కోసమే కడుతున్నారని మమ్మల్ని విమర్శిస్తున్నారని జూపల్లి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా అని విమర్శలు చేశారు. 25 టీఎంసీలతో గొల్లపల్లిని నిర్మిస్తామని 2016లో జీవో ఇచ్చారు. మళ్లీ 2019 మార్చిలో 20 రిజర్వాయర్లు నిర్మించాలని బీఆర్​ఎస్​ పార్టీ ప్రతిపాదించారు. రోజుకు సుమారు 10 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే శ్రీశైలంలో నీళ్లు ఉంటాయా? రాయలసీమ, ముచ్చుమర్రి, గాలేరు – నగరి పేరుతో లిఫ్ట్ చేస్తే పరిస్థితి ఏమిటి? అని బీఆర్​ఎస్​ని ప్రశ్నించారు. పాలమూరు లిఫ్ట్‌ ద్వారా 12 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని మీరే చెప్పారంటూ గుర్తు చేశారు. విద్యుదుత్పత్తి పేరుతో ఏపీ పంపులు ఆన్ చేసి నీరు కిందకు వదిలింది. అప్పుడు ధర్నా చేస్తామని హెచ్చరిస్తే వెనక్కి తగ్గారు అని జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు.

12:14 PM, 10 Apr 2026 (IST)

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,250

  • హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold Rates Today) పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,400, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,250, కిలో వెండి ధర రూ.2,53,000గా ఉంది.

12:14 PM, 10 Apr 2026 (IST)

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

12:14 PM, 10 Apr 2026 (IST)

నల్గొండ: మిర్యాలగూడ ఆలగడప వద్ద రవాణా, రెవెన్యూ అధికారుల తనిఖీలు

  • నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ఆలగడప వద్ద రవాణా, రెవెన్యూ అధికారుల తనిఖీలు చేపట్టారు. ధాన్యం లారీలు, డీసీఎంలను అధికారులు, పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఏపీ నుంచి ధాన్యం అక్రమంగా వస్తున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేశారు. ఈ మేరకు చిల్లేపల్లి టోల్‌గేట్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

12:14 PM, 10 Apr 2026 (IST)

కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నా : కవిత

  • కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రెండున్నరేళ్లు దారుణంగా వ్యవహరించి పంటలు ఎండబెట్టారు, కమిషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారని తెలిపారు. మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని, రూ.5 లక్షలలోపు విలువైన పనులే నామినేషన్ పద్ధతిలో ఇస్తారంటూ మాట్లాడారు. కానీ నామినేషన్ పద్ధతిలో ఇవ్వవద్దని అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిందని రియల్‌ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్‌కు నష్టం చేయవద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

11:45 AM, 10 Apr 2026 (IST)

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు హైకోర్టులో ఊరట

  • కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారం పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారంలోగా సంబంధిత కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యపై పవన్ ఖేరా ఆరోపణలు చేశారు. అసోం సీఎం భార్యకు 3 పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించారు. అసోం సీఎం భార్య ఫిర్యాదుతో పవన్ ఖేరాపై గువాహటిలో కేసు నమోదు కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ వేశారు.

11:28 AM, 10 Apr 2026 (IST)

ఖమ్మం: కూసుమంచి మం. వెంకటరామపురంలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం వెంకటరామపురంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి మంత్రి పొంగులేటి (Ponguleti) హాజరయ్యారు.

11:28 AM, 10 Apr 2026 (IST)

కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ స్పందన

  • కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ సంధ్య స్పందించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకున్నామన్నామని, కేఎంసీలో ర్యాగింగ్‌ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. జూనియర్లను మోకాళ్లపై నిలబెట్టారు, గోడకుర్చీలు వేయించారు ఈ ఘటనలో మొత్తం ఏడుగురు విద్యార్థులను సస్పెండ్​ చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ఇలాంటివి మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని కేఎంసీ ప్రిన్సిపల్​ సంధ్య వెల్లడించారు.

11:28 AM, 10 Apr 2026 (IST)

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించనున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు

  • నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్‌ అగ్రనేతలు ఈ నెల 16, 17 తేదీల్లో పార్లమెంట్​లో ప్రత్యేకంగా సమావేశం అయ్యి చర్చించనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లుపై చర్చించి, 2011 జనాభా లెక్కలు కాకుండా తాజా లెక్కలనే తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అత్యవసరంగా పునర్విభజన, రిజర్వేషన్‌ సవరణ బిల్లులు ఎందుకని కాంగ్రెస్‌ ప్రశ్నపై చర్చించనున్నారు. భేటీలో సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలే పాల్గొంటారని నేతలు చెబుతున్నారు.

11:28 AM, 10 Apr 2026 (IST)

ప్రజారవాణా సౌకర్యాల పెంపుపై మరింత దృష్టి సారించిన ప్రభుత్వం

ప్రజారవాణా సౌకర్యాల పెంపుపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఫ్యూచర్ సిటీ సమీపంలో 500 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలంలోనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, హైస్పీడ్ రైల్ హబ్, బస్ డిపో రానున్నాయి. 500 ఎకరాల కేటాయింపుతో హైదరాబాద్‌లో రవాణా కనెక్టివిటీ పెరగనుంది. బహదూర్‌గూడలో 150 ఎకరాల్లో సిటీ బస్సులు నిలిపేలా అత్యాధునిక టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. అలాగే గాజులరామారంలో 100 ఎకరాల్లో టెర్మినల్‌, ఆరాంఘర్‌లో మరో టెర్మినల్ నిర్మాణం
అత్యాధునిక టెర్మినల్స్‌ నిర్మాణంపై ఆర్టీసీ దృష్టి సారించింది.

10:06 AM, 10 Apr 2026 (IST)

ఇవాళ డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు

30 మంది మావోయిస్టులు ఇవాళ డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్​ రెడ్డి వివరాలు వెల్లడించనున్నారు. లొంగిపోనున్న వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్‌ సభ్యులు, బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్ కేశాలు సహా 30 మంది నక్సల్స్‌ ఉన్నారు. సోది కేశాలు లొంగుబాటును పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. సుమారు 40 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులకు సరెండర్ చేయగా, వాటిలో ఏకే 47 సహా అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. లొంగిపోనున్న వారిలో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌ మావోయిస్టులు ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ పెరగడంతో తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

9:01 AM, 10 Apr 2026 (IST)

మధ్యాహ్నం ఎర్రవల్లికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

మాజీ మంత్రి జీవన్​ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లికి వెళ్లనున్నారు. మాజీ సీఎం కేసీఆర్​ జీవన్‌రెడ్డిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. తాను బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు జీవన్​ రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, బీఆర్ఎస్‌లో చేరిక తేదీ, ఇతర అంశాలపై కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

9:00 AM, 10 Apr 2026 (IST)

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీపీ సజ్జనార్ ఆదేశాలతో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 1,300 మందికి పైగా రౌడీషీటర్లు ఉండగా, వారిలో 250 మందికి హెచ్​న్యూ పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 190 మందికి గంజాయి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. గంజాయి సరఫరాదారులపైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

6:43 AM, 10 Apr 2026 (IST)

నేడు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ఇవాళ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) దిల్లీ బయలుదేరనున్నారు. దిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ (CWC Meeting) సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.

6:43 AM, 10 Apr 2026 (IST)

నేడు దిల్లీ వెళ్లనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కలిసి దిల్లీ వెళ్లనున్నారు. జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీతో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశంకానున్నారు. (BJP state President Ramachandra Rao)

6:40 AM, 10 Apr 2026 (IST)

నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలవనున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం

నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలవనున్నారు. నాదర్ గుల్, కోహెడ మార్కెట్ భూముల వ్యవహారంలో కలెక్టర్‌కు బీఆర్​ఎస్​ బృందం వినతిపత్రం ఇవ్వనున్నారు.



Source link

Spread the love