దిశ,మేడ్చల్ బ్యూరో: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చేరేందుకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన వెబ్ సైట్ ను జిల్లా అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి (రెవెన్యూ) గురువారం తన చాంబర్లో ప్రారంభించారు. జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ జి. కాంతమ్మ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల కరపత్రాలు , బ్యానర్స్ కూడా అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. టి.జి.ఎం.ఆర్.ఇ.ఐ.ఎస్ పాఠశాలలు, కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఐదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పేర్లను ఈ వెబ్ సైట్ :tgmreistelangana. cgg. gov. In నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని ఆధునిక మౌలిక వసతులతో పాటు ఐ.ఐ.టి, జె.ఈ.ఈ, ఎన్.ఈ.ఈ.టి, ఈ.ఎం.సి.ఈ.టి, సి.ఎల్.ఎ.టి,యు. పి.ఎస్.సి, ఎన్.డి.ఎ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని కూడా తెలిపారు. ఈ అవకాశాన్ని మైనారిటీ, మైనార్టీయేతర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ పాఠశాల, కళాశాలల మేడ్చల్ ప్రిన్సిపాల్ ఎం. కృష్ణ , బాలానగర్, శేరిలింగంపల్లి ప్రిన్సిపాల్స్, మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ పాఠశాలల విద్యార్థినులు, గర్ల్స్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.