LIVE FEED
రవీంద్రభారతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక ప్రదర్శనలు
- రవీంద్రభారతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక ప్రదర్శనలు
- తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు
- హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు
- ధుర్యోధనుడి పాత్రపై ఏకపాత్రాభినయం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
- గద్దర్ వేషధారణలో ఉద్యమ పాటలు పాడిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
- కట్టప్ప పాత్రలో నటించి మెప్పించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్
- గద్దర్ వేషధారణలో ఉద్యమ పాటలు పాడిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
- కోయదొర పాత్రలో నటించి మెప్పించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
- బంజారా ఆడబిడ్డలతో కలిసి సేవాలాల్ పాటకు ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ నృత్యం
సిద్దిపేట: గజ్వేల్ మండలం కొడకండ్లలో విషాదం, ఇద్దరు మృతి
- సిద్దిపేట: గజ్వేల్ మండలం కొడకండ్లలో విషాదం, ఇద్దరు మృతి
- మల్లన్నసాగర్‌లో కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
- కాలువలో పడి కుక్కల రిషిత(13), కుక్కల మనీష్(9) గుర్తింపు
- కాలువలో మృతదేహాలను బయటకు తీసిన గ్రామస్థులు, పోలీసులు
మణికొండలో ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని మణికొండలో ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రిద్ధీస్ గ్రాండియర్ అపార్ట్‌మెంట్‌లో మూడో ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో మంటలు వ్యాపించాయి.
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సవాల్
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. “అవినీతి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?. నా బావమరిది, తమ్ముడిపై సీఎం ఆరోపణలు చేశారు. సీఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నా బావమరిది, తమ్ముడిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధం. సీఎం తమ్ముడు, బావమరిదిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా?. హౌస్ కమిటీ కాదు. సీబీసీఐడీ కాదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిద్దాం. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధం సీఎం సిద్ధమా?. పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి సీఎం దొరికిపోయారు. ఏ పని కోసం నేనెప్పుడూ పొంగులేటికి ఫోన్ చేయలేదు. పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైంది. తప్పు జరిగిందని సీఎం, మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు.” అని హరీశ్ రావు తెలిపారు.
సిరికొండ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం
నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారిస్తోంది. జినియాల బిట్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధరించారు. పులి సంచారం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండోరోజు కొనసాగుతున్న క్రీడలు
ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండోరోజు క్రీడలు కొనసాగుతున్నాయి. క్రీడల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఆరు ఓవర్లలో మంజీర జట్టు 67 పరుగులు చేసింది. మూసీ రివర్ టీమ్ బ్యాటింగ్ చేస్తుంది.
టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక
టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో అసోసియట్ అధ్యక్షుడిగా ఎం.సత్యనారాయణగౌడ్, టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శిగా హుస్సేన్ ముజీబ్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు.
ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉంది: రాజగోపాల్‌రెడ్డి
“ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదు. మంత్రుల నియోజకవర్గంలో మాత్రమే బిల్లులు వస్తున్నాయి. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదు. నిధుల కోసం మంత్రులు, సీఎం చుట్టూ తిరగాలా?. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉంది. సీఎం కొడంగల్‌కు చేసుకున్నట్లు మునుగోడులో చేసుకోవాలని ఉండదా?. మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకే లిఫ్ట్‌లన్నీ తరలిస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయకపోతే నేను పదవిలో ఉండటానికి అనర్హున్ని. రెండున్నరేళ్లుగా మనోవేదనతో రగిలిపోతున్నా. ఇప్పుడు అవకాశం వచ్చింది మాట్లాడుతున్నా. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దు.” అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు
ఈ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.1,395 కోట్లు మాత్రమే: హరీశ్‌రావు
“బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ఎన్నో రాష్ట్రాలు కాపీ కొట్టాయి. ఈ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.1,395 కోట్లు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఎస్సీ, ఎస్టీల మీద రేవంత్‌రెడ్డికి ఉన్నది కపటప్రేమ. మంత్రి కంపెనీ అవినీతికి పాల్పడిందనేది సుస్పష్టం. ఆయన మంత్రి పదవిలో ఉండగా దర్యాప్తు పారదర్శకంగా ఎలా జరుగుతుంది.మంత్రిని కాపాడేందుకే రేవంత్‌రెడ్డి సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తామన్నారు. ముందుగా ఆరోపణలు ఉన్న మంత్రిని బర్తరఫ్ చేసి దర్యాప్తు చేయించాలి.” అని హరీశ్‌రావు తెలిపారు
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
ఖమ్మం జిల్లా: కారేపల్లి మండలం జమాలపల్లి వద్ద రోడ్డుప్రమాదం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం జమాలపల్లి వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడి ఆరుగురు పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్: సుకుమా జిల్లాలో ఎదురుకాల్పులు – మావోయిస్టు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. పొలంపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎన్‌కౌంటర్‌ను పర్యవేక్షిస్తున్నారు.
తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు శాసనసభ ఆమోదం
తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ వ్యవస్థల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో పెద్దలను నిర్లక్ష్యం చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం “తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026″ను రూపొందించింది. ఈ బిల్లును శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు తమ తల్లిదండ్రులను సంరక్షించకపోతే వారి వేతనం నుంచి ఒక భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందించే విధానం అమల్లోకి రానుంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీలో విషాదం
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి వద్ద క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో దేవా(12) అనే బాలుడి మృతదేహం లభ్యం కాగా, మరో బాలుడు నాగబాబు(13) కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: తలసాని
కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. పొంగులేటి అంశంపై సభాసంఘం వేయాలని తాము డిమాండ్ చేశామని, ఆ అంశాన్ని వదిలేసి సీఎం కులాల ప్రస్తావన తీసుకువచ్చారన్నారు. కడియం, దానం ఏ పార్టీ సభ్యులని వారికి మాట్లాడే అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. మీరు ఏ పార్టీ వాళ్లో చెప్పాలని మాత్రమే కౌశిక్‌రెడ్డి అడిగారన్నారు.
గస్తీలో ఉన్న ఇద్దరు పోలీసులపై యువకుల దాడి
హైదరాబాద్ మెహిదీపట్నంలో ఇద్దరు పోలీసులపై దాడి జరిగింది. మాసాబ్‌ట్యాంక్ వద్ద శనివారం రాత్రి గస్తీలో ఉన్న ఇద్దరు పోలీసులపై ఇద్దరు యువకులు దాడి చేశారు. అనుమానాస్పదంగా తిరిగుతున్న ఇద్దరిని కానిస్టేబుళ్లు ప్రశ్నించగా, అలీ ఖాద్రి, అబ్దుల్ రెహమాన్ అనే యువకులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా గోసంరక్షణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని రేవంత్ రెడ్డి ఆమెకు వివరించారు. ఎన్కే పల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా మేనకాగాంధీ బృందానికి తెలిపారు. జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మేనకాగాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనకా గాంధీకి అధికారులు వివరించారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కదం తొక్కారు. ఇందిరాపార్క్ వద్ద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారించాలని కోరారు. వారి ధర్నాకు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కవిత, జూలకంటి రంగారెడ్డిలు మద్ధతు తెలిపారు. వారికి సంఘీభావం తెలియజేసిన కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో ఉద్యోగులకు జరిగిన అన్యాయంలో తనకు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలు లేకుండా ప్రతి ఉద్యోగిని గుర్తించాలని ఆమె కోరారు.
రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒక్కటే: కేంద్రమంత్రి బండి సంజయ్
రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఫార్ములా ఈ-రేసు కేసును రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదని సంజయ్ ఆక్షేపించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య డీల్ కుదిరిందని ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో తమపై తుపాకీ పెట్టి రేవంత్ కాలుస్తాం అంటే తాము ఊరుకోమన్నారు. బీఆర్ఎస్- బీజేపీ పొత్తు ఎప్పటికీ జరగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. సీఎం డిప్రెషన్లో ఉండి డీలిమిటేషన్‌పై మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీజేపీ దూరమని సంజయ్ వివరించారు.
శాసనసభా పక్ష కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
కేసీఆర్ ఛాంబర్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు.
శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండు రోజుల పాటు సస్పెన్షన్
శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్, తలసాని, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, పద్మారావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, కె.పి.వివేకానంద్‌ను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు రెండు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.
‘ఖనిజ సంపద ఆదాయాన్ని పెంచాలనే ఆలోచనలతో ప్రభుత్వం పని చేస్తోంది’
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు చేపట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖనిజ సంపద ఆదాయాన్ని పెంచాలనే ఆలోచనలతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.
అసెంబ్లీలో కౌశిక్‌రెడ్డి తీరుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం
అసెంబ్లీలో కౌశిక్‌రెడ్డి తీరుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరిపై కౌశిక్‌రెడ్డి తీరును తప్పుబట్టారు. కడియం శ్రీహరికి కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన కొనసాగుతోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు చేస్తున్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ నినదిస్తున్నారు.
తమిళనాడు : అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్న విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలో నిలుస్తున్నారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున విల్లివాక్కం నుంచి పోటీ చేయనున్నారు. చెన్నైలో జరిగిన టీవీకే సభలో విజయ్ ఈ మేరకు వెల్లడించారు. మాజీ మంత్రి సెంగొట్టియాన్ గోబిచెట్టిపాళ్యం నుంచి పోటీ చేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లేఖ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సభా సంఘం వేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో మొత్తం 19 అంశాలపై విచారణ జరపాలని కోరారు.
రూప్సింగ్ తండా సర్పంచ్ రమణిభాయ్ కుటుంబంలో విషాదం
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్సింగ్ తండా సర్పంచ్ రమణిభాయ్ కుటుంబంలో విషాదం. రమణిబాయ్ కుటుంబంపై ఇటీవల పెట్రోల్ దాడి జరగగా, మంటల్లో కాలిపోయిన సర్పంచ్ పెద్ద కుమారుడు వెంకటేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సర్పంచ్ రమణి భాయ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్తి కోసం కన్నతండ్రి, పిన్నతల్లి కుటుంబంపై అనార్సింగ్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.
సభలో బీఆర్‌ఎస్ సభ్యుల తీరును తప్పు పట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బీఆర్‌ఎస్ పాలనలో తాము సభను అడ్డుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నిన్నటి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు పదే పదే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సభ్యులు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ‘సభా సంప్రదాయాలు తెలిసిన నాయకులు కేటీఆర్, హరీశ్‌రావులు, ఆ సంప్రదాయాలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నారు. అడిగిన వెంటనే సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. అందుకు సంతోషించవలసింది పోయి మొండిగా వ్యవహరిస్తున్నారు. మీరు వేసిన మూడు హౌస్ కమిటీల నివేదికలు ఏం అయ్యాయి. వీటిని అడ్డు పెట్టుకొని పలువురిని బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చెయ్యడం సరికాదు’ అని మండిపడ్డారు.
అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపిస్తామని సీఎం చెప్పారు: శ్రీధర్‌బాబు
అక్రమ మైనింగ్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సీబీసీఐడీ విచారణకు నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి శ్రీదర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ వద్ద ఆధారాలు ఉంటే సీఐడీకి ఇవ్వాలని సూచించారు. అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపిస్తామని సీఎం చెప్పాారని శ్రీధర్‌బాబు వివరించారు.
పోడియం వైపు వెళ్లేందుకు హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నం
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని నినాదాలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేస్తున్నారు. పోడియం వైపు వెళ్లేందుకు హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నంచగా మార్షల్స్ అడ్డుకున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూస్తామన్నారు. సర్కారు దిగిరాకపోతే గవర్నర్‌ను కలిసి పొంగులేటిని బర్తరఫ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరతామని కేటీఆర్ అన్నారు.
కాసేపట్లో గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు గన్‌పార్క్ వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సభా సంఘం వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ సభ్యులు హాజరయ్యారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై శాసససభలో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. సభాసంఘం వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం జగ్గంపేటలో అగ్నిప్రమాదం
మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం తాలుకా జగ్గంపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
పీపుల్స్ ప్లాజా నుంచి 5కె, 2కె రన్
హైదరాబాద్ పీపీల్స్ ప్లాజాలో ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో యువభారత్ రన్ జరుగుతోంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు ముఖ్య అతిథులుగా హాజరై రన్‌ను ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా నుంచి 5కె, 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుయత ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ
ఓ లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే లారీ బోల్తా పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. టికెట్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని నిన్న 82,040 మంది దర్శించుకున్నారు. భక్తుల సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.18 కోట్లు సమకూరింది. 31,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
కొంపల్లి శ్రీనివాస్‌నగర్‌లో వివాహిత ఆత్మహత్య
కొంపల్లి శ్రీనివాస్‌నగర్‌లో వివాహిత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని శాంతికుమారి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎనిమిది నెలల క్రితం ఆమె వెంకటసుబ్బయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇనుప గేటు మీద పడి రెండేళ్ల బాలుడు మృతి
ఇనుపగేటు మీద పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలుకోల్పోయిన హృదయవిదారక హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూపీకి చెందిన వీరేంద్ర శర్మ అనే వ్యక్తి మియాపూర్‌లో ఫాబ్రికేషన్ పనులు చేస్తుంటారు. ఆయనను చూసేందుకు రెండు రోజుల క్రితం భార్యపిల్లలు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే అతడి కుమారుడు అడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఇనుపగేటు మీద పడింది. దీంతో తీవ్రగాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకుని మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ సంస్థల వార్షిక నివేదికలను అసెంబ్లీకి సమర్పించనున్న భట్టి విక్రమార్క
ఇవాళ కూడా శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం పదిగంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. విద్యుత్ సంస్థల వార్షిక నివేదికను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీకి సమర్పిస్తారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతిపై సంతాపం తెలుపుతారు. అనంతరం వ్యాట్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. హెట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ నిరోధక బిల్లును కూడా ప్రవేశపెడతారు. బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపుల పద్దులపై చర్చ జరగనుంది. వైద్య, ఆర్అండ్బీ, ఇరిగేషన్ పద్దులపై ఇవాళ అసెంబ్లీలో ఓటింగ్ జరగనుంది.