
దసరా, దీపావళి పండుగల సమయాల్లో ‘రామ్‌లీల’ నాటకాన్ని ప్రదర్శించడం దేశంలో చాలా చోట్ల ఉంది. రావణ సంహారం, సీతారాముల పట్టాభిషేకం వంటి రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఈ నాటకం ద్వారా వివరించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హోలీ సందర్భంగా రామ్‌లీల నాటకాన్ని ప్రదర్శించే సంప్రదాయం దేశ విభజనకు ముందు నుంచీ కొనసాగుతోంది. గ్వాలియర్‌లోని ఊంట్ పుల్ సమీపంలో ఝాంగ్ సమాజం వారు హనుమంతుడికి చిన్న గుడి కట్టారు. స్వతంత్ర భారతంలో గత 79 ఏళ్లుగా హోలీ నాడు ఇక్కడ ‘రామ్‌లీలా’ కనిపిస్తున్నారు. అఖండ భారతంలో.. ప్రస్తుత పాకిస్థాన్‌లో గల రషీద్పుర్ ప్రాంత ఝాంగ్ వర్గీయులు 120 ఏళ్ల క్రితం ఈ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. నాటక రిహార్సల్ ఎనిమిది రోజుల ముందే మొదలవుతుంది. గ్వాలియర్ సహా పంజాబ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలు స్థిరపడిన ఝాంగ్ సమాజం నుంచి నటులు ఇక్కడికి వస్తారు. వీళ్లెవరూ డబ్బులు తీసుకోరు. పూర్వీకుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడమే అందరి లక్ష్యం. నాటకంలోని నటులందరూ ఝాంగ్ కమ్యూనిటీకి చెందినవారేనని రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు హరియోమ్ నాగ్‌పాల్ తెలిపారు.