వీవీసీ మోటార్స్‌తో తెలంగాణ మహిళా భద్రత విభాగం ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500 మంది మహిళలను ఎంపిక చేసి వారిని విద్యుత్ ఆటోడ్రైవర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా వాహన డీలర్షిప్ సంస్థ వీవీసీ మోటార్స్‌తో బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మహిళా భద్రత విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా సమక్షంలో రెండు విభాగాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఏడాదిపాటు సాగే ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభించడంతోపాటు మహిళా ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణించొచ్చని చారుసిన్హా పేర్కొన్నారు.