వీడని వలసవాద మనో బంధాలు! | భారతదేశ కలోనియల్ మైండ్‌సెట్ చర్చ ప్రభుత్వ విధానాలు చట్టాల పేరు మార్చడం కలోనియల్ లెగసీ రాజకీయాలు


కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలలో పేర్ల మార్పు, విగ్రహ ప్రతిష్ఠాపన ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రతి నెలా కాకపోయినా మూడు నాలుగు నెలలకోసారి ఒక నగరం లేదా ఒక రోడ్డు పేరు మార్పును ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. భాషలో ఉన్న పేరుతో ఒక కొత్త హిందీ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడమో లేదా ఆమోదించడమో జరుగుతోంది. ఎక్కడో ఒకచోట ఒక కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. వలస పాలన అవశేషాలను తొలగించడం లేదా మొగల్ చరిత్ర గుర్తులను తీసివేయడం పేరుతో ఇవన్నీ జరుగుతున్నాయి.

పది రోజుల క్రితం రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఎడ్విన్‌ లూట్యన్స్‌ విగ్రహం స్థానంలో సి.రాజగోపాలాచారి ప్రతిమ నేర్పాడు. కొత్త నగర నిర్మాణ శిల్పి లూట్యెన్స్. రాజాజీగా సుప్రసిద్ధుడైన చక్రవర్తుల రాజగోపాలాచారి భారతదేశ చిట్టచివరి గవర్నర్‌–జనరల్‌, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యంగా మహాత్మాగాంధీ ‘మనస్సాక్షి సంరక్షకుడు’ (కాన్-సైన్స్ కీపర్)గా సువిఖ్యాతుడు. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో గౌరవించింది. రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో రాజాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ఆయన సమున్నత చరిత్రను జాతి జ్ఞాపకం చేసుకుంటున్న తీరుకు ఒక ఉదాత్త తార్కాణం. ఈ సంస్మరణను, ఎలా అనేదే సమస్య. జాతీయవాద సంబంధితమైనదని వివరిస్తున్నప్పటికీ వలసవాద పాలన దుష్ప్రభావాల నుండి విముక్తి సాధనకు అదోక స్ఫూర్తిదాయక చిహ్నమని ఘంటాపథంగా చెప్పారు. రాష్ట్రపతి భవన్‌లో సౌధ వాస్తు శిల్పి లూట్యెన్స్‌ ప్రతిమను తొలగించడంపై సహజంగానే సణుగుడు విన్పించింది. కొంతమంది తీవ్ర విమర్శలూ చేశారు. అయితే ఆ విమర్శలు, ఆక్షేపణలు జాతి వ్యతిరేకమైనవని, వలసవాద బానిసత్వానికి గుర్తులని సామాజిక మాధ్యమాలలో చాలా ధ్వజమెత్తారు. లూట్యెన్స్‌ న్యూఢిల్లీ నగర నిర్మాణశిల్పి కదా అని అన్నప్పుడు భారతీయుల గురించి ఆయన అభిప్రాయాలను ఏకరువు పెడుతూ ప్రస్తుతం వాస్తుశిల్పి ఒక జాతీయహంకారవాది అని వర్తమాన జాతీయవాద ధోరణులను సమర్థించేవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లెక్కన, గతించిన కాలంలోని మన నాయకులు ఎంతమంది విశాల, మానవతా భావాల పరీక్షలో నెగ్గుతారు?

అదాలా ఉంచితే స్వాతంత్ర్యంతర, ముఖ్యంగా మన వర్తమాన నాయకుల వలసవాద వ్యతిరేకతను నిశితంగా చూడవలసిన అవసరం ఉంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ చారిత్రక దృక్పథం, విధాన నిర్ణయాలు, సాంస్కృతిక ఆసక్తులు, ప్రతిపాదిత చట్టాలు, ఆర్థిక అజెండా… అన్నీ వలస పాలకుల విధానాలు, వ్యూహాలు, శిక్షణకు అనుగుణంగా ఉన్నాయి.

వలసవాదం విషయంలో బయటి మనిషి వర్సెస్ లోపలి మనిషి అంటే విదేశీయులు వర్సెస్ దేశీయులు అన్న వాదన సహేతుకమైనది కాదు. వలసవాదులు ఎవరు (దేశీయుల, విదేశీయుల) అన్న ప్రశ్న వలసవాదం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ ప్రశ్న వలసవాదం నిజస్వభావాన్ని కప్పిపుచ్చుతుంది. వలసవాదం ఒక సాంస్కృతిక–ఆర్థిక వ్యవస్థ. ప్రజలను సంపూర్ణంగా నియంత్రించే వ్యవస్థ. అవసరమైతే వారిని పూర్తిగా కకావికలు చేయగల శక్తిమంతమైన అధికార వ్యవస్థ. వలసవాదం ప్రజలకు ప్రాథమిక హక్కులను నిరాకరిస్తుంది. శిక్షా స్మృతి, నేర విచారణా స్మృతి మొదలైన వలస పాలకుల కాలం నాటి చట్టాల స్థానంలో 2023లో భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలను తీసుకువచ్చారు. అయితే ఆ చట్టాలలో మార్పులు సారహీనమైనవని న్యాయశాస్త్ర కోవిదులు కొట్టివేశారు. ఈ సంహితలలోని కొన్ని కొత్త నిబంధనలు వలస పాలనా కాలం నాటి చట్టాలలోని నిబంధనల కంటే కూడా ప్రగతి నిరోధకమని వారు స్పష్టంగా ఎత్తి చూపారు. చట్టాల పేర్లు మార్చారు కానీ ఆ పేర్ల మార్పుతో పాటు రాజ్య వ్యవస్థలో, పౌరుల మధ్య సంబంధాలలో మార్పేమీ రాలేదు.

ఇటీవల న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌–2026 వద్ద ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల అర్ధనగ్న నిరసన ప్రదర్శనను చూడండి. కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఎలా ఉంటుందో వారి నిరసన జాతి ప్రయోజనాలకు ఏ విధంగానూ వ్యతిరేకం కాదు, దేశ ప్రతిష్ఠకు భంగకరమైనది కానే కాదు. ప్రజలు ఆగ్రహావేశాలతో నిర్వహించే నిరసన ప్రదర్శనలకు వలస పాలకులు, నిరంకుశ ప్రభుత్వాలు మాత్రమే భయపడతాయి. ఏఐ సదస్సులో నిరసన ప్రదర్శన కారణంగా అరెస్టయిన కాంగ్రెస్ కార్యకర్తలలో కొంత మంది ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. వారికి బెయిల్ ఇవ్వాలని కోర్టు ఆమోదించడం లేదు.

ఇరుగుపొరుగువారి భూముల్లోకి ప్రవేశించడం, వాటిని స్వాధీనం చేసుకోవడం, అక్కడి చెట్టు చేమ, కొండ కోన, వాగు, వంక, నదిని, మరీ ముఖ్యంగా తోటి పౌరుల జీవనరీతులను ధ్వంసం చేయడం… ఇది ఊరి ప్రజల శ్రేయస్సుకు, దేశ ప్రయోజనాలకు అని గంభీరంగా చెప్పడమనేది వలసవాద–పెట్టుబడిదారీ వ్యవస్థల మరో కుతంత్రం. గ్రేట్ నికోబార్ దీవిలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే సుమ! ఆ దీవిలో, 130 క్వార్టర్ గ్రేడ్ భూమితో సహా 166 చదరపు చదరపు వైశాల్యంలోని భూములలో పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఈ నిర్వాకాన్ని చేసిన తీరు పూర్తిగా– అవును, ఎటువంటి మినహాయింపు లేకుండా, వలసపాలనా సంబంధించినది. నిజమే, గ్రేట్‌ నికోబార్‌ మన భారత్‌లో భాగమే. అయితే ఆ దీవి, అక్కడి ప్రజల ప్రభుత్వాల సంరక్షణలో ఉంటూ వచ్చారు. వారికి రక్షణ కల్పించడమంటే వారి జీవనరీతులు, పర్యావరణాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని విస్మరించి పర్యావరణాన్ని సామాజిక జీవనరీతులను నిర్మూలించడం వలసవాద క్రూరత్వం కాక మరేమిటి? గ్రేట్ నికోబార్ ప్రజలకు మనం బయటి మనుషులమే. వారి భూభాగాలను స్వాధీనం చేసుకున్న వలసదారులమే.

భారత ప్రజల కుల మతాలు, ఇతర సంకుచిత అంతరాల ప్రాతిపదికన విడదీయడమే వలస పాలకుల అజెండాగా సదా ఉండేది. మతం పేరుతో హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించారు. ఉభయ మతస్థులు సామరస్యపూర్వకంగా తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి వీలు లేకుండా చేశారు. ఇందుకుగాను ఒకరిపై ఒకరికి విద్వేషాలు పుట్టే విధంగా చరిత్రలు రాశారు. హిందువులు, ముస్లింలు ఒకరితో ఒకరు పోరాడుతున్నప్పుడు వలస పాలకులు పరమానందభరితులయ్యారు. ప్రస్తుత పాలకుల ప్రోత్సాహంతో చరిత్రను తిరగరాస్తున్న తీరుతెన్నులు మత సామరస్యానికి దోహదం చేసేవిగా లేవు. వలస పాలకుల హయాంలో కంటే ఘోరమైన పక్షపాతాలు చరిత్ర రచనలో ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. పాఠ్యపుస్తకాలలోను ప్రజా చర్చలలోను ఈ ధోరణులు ప్రబలమవుతున్నాయి. వలస పాలకుల పక్షపాత వైఖరులే మరో విధంగా కొనసాగుతున్నాయి. కాకపోతే ఆ కాలంలో పాలకులుగా శ్వేత జాతీయులు ఉంటే ఇప్పుడు హిందూత్వవాదులు ఉన్నారు. ఈ పాలకులు స్థానికులే కనుక వారి మద్దతుదారులు దుర్బల ముస్లింలపై దాడులు జరుపుతున్నారు. ముస్లిం ఆరాధనా మందిరాలు వాస్తవంగా హిందూ ఆలయాలే అన్న వాదనతో న్యాయస్థానాలలో ముస్లింల హక్కులపై పోరాటాలు చేస్తున్నారు. సాంస్కృతిక రంగంలో కూడా ఈ ఆధిపత్య దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవడంలో వలసకులు ప్రోత్సహించిన వారినే ఈనాటి సంకుచితాలు పాటించారు. మేధో నిష్పాక్షికతకు తిలోదకాలు ఇచ్చివేస్తున్నారు. స్వతంత్ర ఆలోచనలను అణచివేస్తున్నారు. ప్రజల మధ్య కృత్రిమ విభజనలు పడుతున్న నాటి బ్రిటిష్ వారితో నేటి పాలక వర్గాలూ పోటీ పడ్డాయి. వలస పాలకులు అధికారాన్ని పూర్తిగా తమ చేతుల్లోనే కేంద్రీకరించుకున్నారు. ఆ పాలనా బోధననే భారత ప్రభుత్వమూ అక్షరాలను అనుకరిస్తున్నట్టుగా ఉంది. బ్రిటిష్ వలస పాలకులు సమాఖ్య పాలనా పద్ధతిని ప్రోత్సహించలేదు. కేంద్రీకృత పాలనే చేశారు. ప్రజాస్వామిక ఆరాటాలను కఠినంగా అణచివేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అలానే చేస్తోంది.

మనం వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకోవాలి. అందుకు గతాన్ని మంచి చెడుల సరళ సమ్మేళనంగా కాకుండా ఒక కొత్త వాస్తవంగా గుర్తించాలి. ప్రజల అనేకానేక విభిన్న అనుభవాలు కొన్నిసార్లు ఏకమవుతూ అనేకసార్లు పరస్పర విరుద్ధమవుతుంటాయనే బహుముఖ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన వర్తమానంలో అనేక వైరుధ్యాలు ఉన్నాయని, అది చాలా క్షుద్రమైనదనే వాస్తవాన్ని కూడా అంగీకరించాలి. ఈ సత్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం మంచిదికాదు. సమకాలీన సమస్యలకు గతాన్ని నిందించడం అంతకంటే ఎక్కువ ఉపయోగకరం కాదు. ఒక ప్రజాస్వామిక సమాజంగా మనం విఫలమయ్యాం. ఇది స్వయంకృతం. దీన్ని అంగీకరించడమే గొప్ప వలసవాద వ్యతిరేక చర్య అవుతుంది. ప్రజలకు జీవిత హుందాను, హక్కులను, న్యాయాన్ని వలసవాదులు నిరాకరించారు. ప్రతి వ్యక్తికీ సమకూరేలా మనం ఇప్పుడు బాధ్యత వహించాలి. సమాజంలో అట్టడుగున ఉన్నవారి జీవితాలు కూడా ఆ సమున్నత విలువలతో వెలుగొందేందుకు మనం పూచీ వహించాలి. హక్కుల నిరాకరణను నిర్భయంగా ఎదుర్కొనే తెగువను ప్రతి ఒక్కరికీ ఉండేలా చేయాలి.

మన గణతంత్ర రాజ్య నిర్మాతలు మనకొక సమున్నత రాజ్యాంగాన్ని, మనకు ప్రాధాన్యత వహించే వివిధ చిహ్నాలను ఇచ్చారు. వారు గతాన్ని చెరిపివేయలేదు, బ్రిటిష్ పాలకుల కథనాలను గుడ్డిగా అంగీకరించలేదు. గత యుగాల నుంచి యోగ్యమైన వాటిని స్వీకరించారు, వర్తమానాన్ని సరికొత్త రీతుల్లో ఊహించారు. వలసవాద ఆదరణ నుంచి మన మేధస్సు, స్వేచ్ఛగా ఉండే భవిష్యత్తును వారు స్వప్నించారు.

టి.ఎమ్.కృష్ణ

భారతీయ సంగీతవేత్త, ప్రజామేధావి

(ది టెలిగ్రాఫ్)

ఇవి కూడా చదవండి…

లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

తాజాగా చదవండి AP వార్తలు మరియు తెలుగు వార్తలు

నవీకరించబడిన తేదీ – మార్చి 06, 2026 | 02:56 AM



Source link

Spread the love