పలు స్కీమ్ల ఏకీకరణతో ఈ పరిస్థితి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర నిధుల కేటాయింపులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.51 కోట్ల మేర కోత పడింది. రాష్ట్రీయ కృషి వికాస్యోజన, సూక్ష్మసాగునీరు, భూసార ఆరోగ్య నిర్వహణ, వర్షాధార ప్రాంత అభివృద్ధి, డిజిటల్ వ్యవసాయం, వెదురు అభివృద్ధి పథకం, సహజ వ్యవసాయం తదితర కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో ఏటా రూ.1,439.49 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో 60శాతం వాటా కింద కేంద్రం రూ.871.15 కోట్లు విడుదల చేస్తోంది. ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.820 కోట్లు మాత్రమే పేర్కొన్నారు. రూ.51 కోట్ల మేర తగ్గించారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయాధికారులు సంప్రదించగా… ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనలో కొన్ని కేంద్ర పథకాలను విలీనం చేయడంతో రాష్ట్రానికి నిధులు తగ్గాయని కేంద్ర అధికారులు సమాచారం ఇచ్చారు.
నాలుగు జిల్లాల్లో ఆ పథకం: సీఎం ధన్-ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రంలో జనగామ, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలు ఎంపికయ్యాయి. దీనికింద ఏటా రూ.160 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.960 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో 31 పథకాలను విలీనం చేయగా.. అందులో తెలంగాణలో అమలయ్యే ఆరు పథకాలున్నాయి. వాటన్నింటినీ ఒకే పద్దుగా నిధులు కేటాయించడంతో రాష్ట్రానికి రూ.50 కోట్ల మేర తగ్గినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ధన్-ధాన్య పథకానికి అదనంగా నిధులు వస్తాయని భావిస్తుండగా… ఉన్నవాటిలో కోత విధించడంపై వ్యవసాయాధికారుల ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయనున్నారని తెలిపారు.