ఎంపీ ఆర్.కృష్ణయ్య

కాచిగూడ, న్యూస్‌టుడే: విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్న హైకోర్టు తీర్పునకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు బీసీ ఐకాస ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుపై ఆదివారం కాచిగూడలోని మహారాజా క్లాసిక్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రాజేశ్‌యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 బీసీ సంఘాల భవిష్యత్తు కార్యాచరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్యపై ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.6 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలన్నారు. నాయకులు నీల వెంకటేశ్, శివ, శ్రీనివాస్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.