ప్రవేశాలకు విద్యాశాఖ అనుమతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎన్నో నెలలుగా ఈ దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండగా.. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదంతో విద్యాశాఖ జీఓ 30 జారీ చేసింది. ఒక్కో కళాశాలకు ఒకటి నుంచి ఐదు కోర్సులకు అనుమతి దక్కింది. ఒక్కో కోర్సులో కనిష్ఠంగా 15 నుంచి గరిష్ఠంగా 60 సీట్లున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం(2025-26) నుంచి ప్రవేశాలు జరుపుకోవచ్చు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పాలిటెక్నిక్ పూర్తి చేసి.. కనీసం ఏడాది పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు బీటెక్ కోర్సులో చేరొచ్చు. బీటెక్ చేసిన వారు ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. సాయంత్రం వేళ తరగతులు ఉంటాయి. రెగ్యులర్ కోర్సులకు ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంటెక్ కోర్సులకు అనుమతి..
2024లో జారీ చేసిన జీఓ ప్రకారం ఈసెట్ కన్వీనరే పరీక్ష నిర్వహించాలి. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సైతం ఈసెట్ కన్వీనర్, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య చంద్రశేఖర్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎంటెక్ సీట్ల భర్తీకి కూడా ప్రభుత్వం జీఓ జారీ చేయగా.. వాటి భర్తీ ఎలా చేయాలన్న దానిపై స్పష్టత లేదు. మూడు నాలుగు కళాశాలల్లోనే సాయంత్రం ఎంటెక్ కోర్సులకు తాజాగా అనుమతి దక్కింది.
అనుమతి పొందిన కళాశాలలివీ..
1.సీబీఐటీ
2.వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి
3.ఎంవీఎస్‌ఆర్
4.స్టాన్లీ
5.మెథడిస్ట్
6.ఎంజీఐటీ
7.మాతృశ్రీ
8.అబ్దుల్ కలాం
9.జయప్రకాశ్ నారాయణ్(మహబూబ్‌నగర్)
10.అనుబోస్(పాల్వంచ)
11.సిద్ధార్థ
12.సెయింట్ పీటర్స్