Revanth Reddy: కాంగ్రెస్‌ను ఓడించేందుకు భాజపా, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం: సీఎం రేవంత్‌రెడ్డి


పరిగి: రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (రేవంత్ రెడ్డి)తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు.  ‘‘గత పాలకులు చేసిన తప్పులను సరిచేస్తూ పాలన కొనసాగిస్తున్నాం. రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం. అప్పులున్నా.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ, చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికాల్‌ బంధంతో భాజపా, బీఆర్‌ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొందపెట్టారు. కాంగ్రెస్‌తో పోరాడటం మావల్ల కాదని భాజపాతో బీఆర్‌ఎస్‌ కలిసిపోయింది.

భాజపా అభ్యర్థుల బీఫామ్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఇచ్చే దుస్థితి ఏర్పడింది. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్‌ఎస్‌, భాజపా ప్రయత్నించలేదు. ప్రధాని మోదీని చూసి ఓటేయాలని భాజపా నేతలు అడుగుతున్నారు. పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే.. పిల్లగాడు పనికి రాకపోతే ఏం చేయాలి?మోదీని చూసి ఓటేస్తే.. గల్లీ భాజపా నేతలు పనిచేయకపోతే మోదీని అడగలేము కదా?

పదేళ్లలో సమస్యలు పరిష్కరించి ఉంటే బీఆర్‌ఎస్‌, భాజపా నేతలు వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి  ఉండేది కాదు. అడగకుండానే ప్రజలు ఓటేసేవారు. ఓట్లు కావాలి కానీ, ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా? ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.38వేల కోట్లతో నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడినని చెప్పుకొని కేసీఆర్‌.. రంగారెడ్డి జిల్లాలకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారు.  కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం.. మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది. కాళేశ్వరం వల్ల కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్‌లు వచ్చాయి. గోదావరి జలాల ముసుగులో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్‌, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది’’ అని సీఎం హామీ ఇచ్చారు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రి శ్రీధర్‌బాబు స్థానిక నేతలు సభలో పాల్గొన్నారు.



Source link

Spread the love