అజిత్ పవార్: మరాఠ్వాడ గడ్డపై రాజకీయ మాంత్రికుడు


ఎత్తుకు పైఎత్తుల్లో వ్యూహ చతురుడు అజిత్‌ పవార్‌

ఉమ్మడిమైన మరాఠ్వాడా రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నేత అజిత్‌ పవార్‌. బాబాయి శరద్‌పవార్‌ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చి…అధికార నిచ్చెన మెట్లను వడివడిగా అధిరోహించేలా ఆయననే ధిక్కరించి తిరుగుబాటు జెండా ఎగురేశారు. లక్ష్యసాధనలో రాజకీయ విధేయతలను మార్చడానికి ఏమాత్రం తటపటాయించని వ్యక్తి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అధిరోహించడమే తన లక్ష్యమని నిర్మొహమాటంగా వెల్లడించిన ఆయన…ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు. అయితే, చిరకాల స్వప్నం సాకారం కాకముందే విమాన ప్రమాదం ఆయన జీవితాశయాన్ని సమాధి చేసింది.

1959, జులై 22న ఆశ, అనంత్‌రావ్‌ పవార్‌ దంపతులకు అజిత్‌ పవార్‌ జన్మించారు. మరాఠ్వాడా రాజకీయ దిగ్గజం శరద్‌పవార్‌ ఆయనకు స్వయానా చిన్నాన్న. బాబాయి అడుగుజాడల్లో నడుస్తూ అజిత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1982లో ఒక చక్కెర కర్మాగారం పరిపాలన బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు. 1991లో బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ తదనంతరం తన బాబాయి కోసం త్యజించారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) స్థాపించిన శరద్‌ పవార్‌కు సరైన రాజకీయ వారసుడు అజితే అని భావించేంతగా పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలతో గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. కాలక్రమంలో సొంత బలం కలిగిన నేతగా, వ్యూహకర్తగా ఎదిగారు. నిర్విరామంగా శ్రమించే వ్యక్తిగా గుర్తింపుపొందారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ప్రతి సంక్షోభం నుంచి విజేతగా బయటికి వచ్చారు. రూ.70 వేల కోట్ల నీటిపారుదల కుంభకోణం కానీ, తన కుమారుడు పార్థ్‌తో సంబంధం ఉన్న పుణె భూ వివాదం కానీ అజిత్‌ను ఏమీ చేయలేకపోయారు. కాంగ్రెస్, శివసేన, భాజపా ప్రభుత్వాల్లో ఆయన ఉపముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం.

బారామతిపై కినుక వహించి..

పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతిలో కొన్నేళ్లుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ తన సతీమణి సునేత్రను అభ్యర్థిగా నిలబెట్టగా.. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియ సూలే పోటీకి దిగి విజయం సాధించారు. దీంతో బారామతి ప్రజలపై అలక వహించిన అజిత్.. ఇంకోసారి ఇక్కడి నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత మనసు మార్చుకుని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

బాబాయిపై తిరుగుబాటు

అజిత్‌ పవార్‌ 2023 జులైలో తన చిన్నన్న, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌పై తిరుగుబాటు చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలను చీల్చుకొనిపోయి భాజపా కూటమితో చేతులు కలిపారు. తదనంతర పరిణామాల్లో పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం కూడా అజిత్ వశమయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఒక్క సీటు మాత్రమే లభించింది. ఐదు నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరిగి పుంజుకొని 41 స్థానాలను కైవసం చేసుకున్నారు. శరద్‌ పవార్‌ బహిరంగ ని ఎన్సీపీకి 10 స్థానాలు మాత్రమే దక్కాయి. బాబాయిపై రాజకీయంగా పైచేయి సాధించారు. అంతకుముందు…2019 నవంబరులో జరిగిన రాజకీయ పరిణామాల్లో దేవేంద్ర ఫడణవీస్‌ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ బాధ్యతలు చేపట్టిన ఘట్టం ఓ రాజకీయ సంచలనం. నాటి ఫడణవీస్‌ ప్రభుత్వం రెండు రోజులు మాత్రమే మనుగడ సాగించగలిగింది. ఆనాడు బాబాయి శరద్‌ పవార్‌ వ్యూహం ఫలించడంతో అజిత్‌ వెనక్కి తగ్గారు.


పవార్‌కు పర్యాయ పదం.. బారామతి

మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన పవార్ కుటుంబానికీ బారామతికి విడదీయరాని అనుబంధం ఉంది. 1967 నుంచి శరద్‌ పవార్‌కు కంచుకోటగా ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం 1991 నుంచి అజిత్‌ పవార్‌కు ఆశ్రయమిస్తోంది. ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది బారామతినే. అజిత్‌ పవార్‌ 8 పర్యాయాలు ఇక్కడి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. రాజకీయాలకు అతీతంగా పాల సంఘాలు, చక్కెర ఫ్యాక్టరీలు, సహకార బ్యాంకులు తదితర సహకార సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. సన్నిహితులు ఆప్యాయంగా ”దాదా”(అన్నా) అని పిలుచుకునే అజిత్‌ పవార్‌ మనసులోని మాటను సూటిగా బయటికి చెప్పేవారు.


నేషనల్ డెస్క్



Source link

Spread the love