ప్రతీకాత్మక చిత్రం
ఫోటో: ట్విట్టర్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు బుధవారం (ఫిబ్రవరి 11) పోలింగ్ జరిగింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్‌లకు పోలింగ్ నిర్వహించగా… 73.01 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీలలో 75.88 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మున్సిపల్ కార్పొరేషన్‌లలో 66.05 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌లలో అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం నమోదైంది. అదే మున్సిపాలిటీలలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 91.91 శాతం నమోదు కాగా, నల్గొండ జిల్లాలోని నందికొండలో 59.68 శాతం నమోదైంది. చౌటుప్పల్‌తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి, చందూరు, సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మున్సిపాలిటీలలో 90 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు జరిగాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఏ బూత్‌లోనూ రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాలేదని చెప్పారు. పోలింగ్ సందర్భంగా వెబ్‌కాస్టింగ్… శాంతిభద్రతలను కాపాడేందుకు, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహించేందుకు సహాయపడిందని తెలిపారు.
ఇక, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ నరసింహ సహా అనేక మంది రాజకీయ నాయకులు తమ తమ మునిసిపాలిటీలలో ఓటు వేశారు. ఇక, కరీంనగర్ పట్టణంలోని 58వ డివిజన్‌లో ఒక పోలింగ్ కేంద్రం వద్ద రెండు గ్రూపులు ఘర్షణ పడిన తర్వాత పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. తన ఓటు ఇప్పటికే వేరొకరు వేసారని ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ నాయకులు నకిలీ ఓటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించిన తర్వాత 15వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఇక, సంగారెడ్డి పట్టణంలో కూడా కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. శుక్రవారం రోజున కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల పదవులకు పరోక్ష పద్దతిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇక, తెలంగాణ రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలోని 2,582 వార్డులు కలిపి మొత్తం 2,996 మంది సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ మున్సిపాలిటీలలోని 12 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా… ఒక స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. మక్తల్‌లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతి వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో బుధవారం రోజున 2,569 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక, మున్సిపల్ కార్పొరేషన్‌ల విషయానికి వస్తే… రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, 412 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.