మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం..


హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ (తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు) శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల11వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్‌ కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో, మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో జరుగుతోంది.

కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది పోలీసులు, సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు తప్పనిసరిగా ఐడీ కార్డు కలిగి ఉండాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సరైన గుర్తింపు పత్రం లేకుండా ఎవరికీ కేంద్రంలోకి అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తన కార్యాలయం నుంచి మొత్తం ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది?

మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించి, అనంతరం సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపడుతున్నారు. ప్రతి వార్డు వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుళ్ల వద్దకు తీసుకువస్తారు. పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున బ్యాలెట్లను కట్టి, డ్రమ్‌లో వేసి కలిపిన తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పత్రాలను (40 బండిల్స్) ఒక్కో టేబుల్‌కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్క ట్రేలలో వారికి వచ్చిన ఓట్లను వేరు చేస్తారు. ప్రతి 100 ఓట్లను ఒక కట్టగా కట్టి నమోదు చేస్తారు. రౌండ్ ముగిసిన వెంటనే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా ఓట్లు, చెల్లని ఓట్ల వివరాలను నమోదు చేసి, అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఇదే విధానాన్ని ప్రతి వార్డులో అమలు చేస్తారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత విజేతలకు అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఈ నెల 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల గణాంకాలు

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో మొత్తం 2,582 వార్డులు ఉన్నాయి. అందులో 12 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగతా 2,569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ స్థానాలకు 10,719 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అదే విధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 414 డివిజన్లు ఉన్నాయి. అందులో 2 డివిజన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 412 స్థానాలకు పోలింగ్ జరగ్గా, 2,225 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

పారదర్శకతకు ప్రాధాన్యం

ఈసారి ఎన్నికల కౌంటింగ్‌లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి దశలో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరా నిఘా, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహించడం ద్వారా నిష్పక్షపాతంగా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న అసద్ గ్యాంగ్… భయంతో వణికిపోతున్న ప్రజలు

తాజాగా చదవండి తెలంగాణ వార్తలు మరియు AP వార్తలు మరియు తెలుగు వార్తలు

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 13 , 2026 | 08:10 AM



Source link

Spread the love