ఏఐ ఎక్స్‌పోపై ప్రధాని వ్యాఖ్య

దిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ గ్లోబల్ సమిట్‌లో ప్రదర్శనలను తిలకిస్తున్న సందర్శకులు
దిల్లీ: ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఏఐని తీర్చిదిద్దడంలో భారతీయ ప్రతిభా సామర్థ్యాలకు ఇది వేదికని వ్యాఖ్యానించారు. మానవాభివృద్ధిలో బాధ్యతాయుతంగా, సమగ్రంగా ఏఐని ఉపయోగించుకోవడంలో భారత్ నిబద్ధతను ఈ ఎక్స్‌పో పునరుద్ఘాటించిందని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు.
ఎక్స్‌పోలో గందరగోళంపై కేంద్ర మంత్రి క్షమాపణ
ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో తొలి రోజైన సోమవారం నెలకొన్న గందరగోళంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. రానున్న రోజుల్లో ఇబ్బందుల్లేకుండా చూస్తామని మంగళవారం ఆయన ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ సమిట్‌లో తొలి రోజున హాళ్లన్నీ జనంతో నిండిపోయాయి. భారీ క్యూలు కనిపించాయి. మొబైల్ డేటా కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. దీంతో గందరగోళం నెలకొంది. దీనిపై మంత్రి స్పందించారు. ‘ఇది అతి పెద్ద సమిట్. స్పందన అనూహ్యంగా ఉంది. తొలి రోజు 70,000 మంది వచ్చారు. సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు క్షమాపణలు చెబుతున్నా’ అని వేదిక వద్ద జరిగిన మీడియా సమావేశంలో వైష్ణవ్ పేర్కొన్నారు.
అంతకుముందు సమిట్‌లో గందరగోళంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని అభిప్రాయపడింది.