రాష్ట్ర పేరు మార్పునకు కచ్చితమైన కాలపరిమితి ఉండదు. అసెంబ్లీ తీర్మానం, కేంద్ర పరిశీలనలు, పార్లమెంట్ చర్చలు, రాష్ట్రపతి ఆమోదం వంటి దశలు పూర్తవ్వడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ పేరు మార్పు ప్రతిపాదన 2016లో పంపినా ఇప్పటికీ పూర్తి కాలేదు.
ఖర్చు విషయానికి వస్తే ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. సాధారణంగా ఒక రాష్ట్రం లేదా పెద్ద నగరం పేరు మార్పునకు సుమారు 200 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. రోడ్ సైన్ బోర్డులు, హైవే మార్కర్లు, రైల్వే స్టేషన్ బోర్డులు, ఎయిర్పోర్ట్ బోర్డులు మార్చడం పెద్ద ఖర్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో లెటర్ హెడ్లు, అధికార ముద్రలు, ఐడీ కార్డులు, ఫైళ్లు మార్చాలి.
డిజిటల్ రికార్డులు కూడా మార్చాలి. ప్రభుత్వ వెబ్సైట్లు, భూసమాచారం, డేటాబేస్, మ్యాపులు, పన్ను వ్యవస్థలన్నీ నవీకరించాలి. ప్రైవేట్ సంస్థలకూ ఖర్చు ఉంటుంది. బ్యాంకులు, కంపెనీలు, విద్యాసంస్థలు తమ పత్రాలు, చిరునామాలు మార్చుకోవాలి. ఉదాహరణకు అలహాబాద్ పేరు ప్రయాగ్‌రాజ్‌గా మారినప్పుడు సుమారు 300 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు అంచనా.