
చార్మినార్ సమీప శాలిబండ – ఫతేదర్వాజా మార్గంలో పత్తర్కా గోష్ సిద్ధం చేస్తూ..
చార్మినార్, న్యూస్టుడే : రంజాన్ మాసంలో వివిధ రకాల ప్రత్యేక వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇఫ్తార్ సమయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు రంజాన్ షాపింగ్ సందడితోపాటు ఆహార పానీయాలకు గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా రాతి (పత్తర్)పై వేపుడుతో సిద్ధం చేసే పత్తర్గా ఘోష్ మాంసాహార వంటకాన్ని రాత్రి వేళ యువత మక్కువగా ఆరగిస్తారు. మరగ్, షీక్ కబాబ్ వంటకాలను రూమాలీ రోటీ, తుర్కిష్ రొట్టెలను భోజన ప్రియులు ఇష్టంగా ఆరగిస్తున్నారు. చికెన్లో అల్ ఫహమ్, చికెన్ టిక్కా, చికెన్ మలాయి, చికెన్ చంగేజీ వంటి అనేక రుచులు అందుబాటులో ఉన్నాయి. పత్తర్కా ఘోష్ వంటకాలు విక్రయించే చోటే ప్రత్యేకంగా స్వీట్లు కుబానీ మిఠా, కద్దుకా మిఠాలను విక్రయిస్తున్నారు.
హలీం.. దహీవడ.. చిరుతిళ్ల జోరు

ఇఫ్తార్ అనంతరం రంజాన్ ప్రత్యేక వంటకాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాయత్రం నుంచి అర్ధరాత్రి దాటే వరకు హలీంతోపాటు వివిధ మాంసాహార, శాకాహార వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి. దహీవడ, సమోసా, మిర్చీ బజ్జీల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. శాలిబండ, టోలిచౌకి, అత్తాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో వెజ్ హలీం అందుబాటులో ఉంది. తెల్లవారు జామున సహరీ కోసం వివిధ వంటకాలను పలు హోటళ్లు ప్రత్యేకంగా సిద్ధంచేస్తున్నాయి.
రాత్బజార్లో ఊపందుకున్న విక్రయాలు

చార్మినార్ సమీప రాత్బజార్లో విక్రయాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల కంటే.. రంజాన్ రాత్బజార్లో వివిధ వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయని ముస్లింలతోపాటు అన్నివర్గాల ప్రజలు తరలివచ్చి తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. దుస్తులు, పాయసం పాత్రలు, పాదరక్షలు, కాస్మెటిక్ వస్తువుల విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి.