తగ్గిన వరి విత్తన సాగు | general


గతేడాది అమ్మకాలు తగ్గి భారీ నష్టాలు

వీణవంకలో ఆడ-మగ విత్తన పంట క్షేత్రం

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌:  కరీంనగర్‌ జిల్లాలో ఈసారి వరి విత్తన సాగు తగ్గింది. గతేడాది ఉత్పత్తి చేసిన విత్తనాల అమ్మకాలు తగ్గి భారీగా నష్టం రావడంతో సీడ్‌ ప్లాంట్ల యజమానులు ఈసారి సాగు తగ్గించారు. హుజూరాబాద్‌ డివిజన్‌లో వేల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత యాసంగిలో సుమారు 1.55 ఎకరాల్లో లోకల్‌ సీడ్‌(ఓపెన్‌ పాలినేటెడ్‌), ఆడ మగ(హైబ్రీడ్‌) సాగవగా.. ఈసారి లక్ష ఎకరాల్లో కూడా సాగవదని అంచనా ఉంది. దేశంలో పేరొందిన 35 కంపెనీలు ప్రతీ యాసంగిలో ఇక్కడి రైతులకు ఫౌండేషన్‌ సీడ్‌ ఇచ్చి విత్తన సాగు చేయిస్తున్నారు. విత్తనాలను వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

సన్నాల ప్రభావం

ఉమ్మడి జిల్లాలో 65 సీడ్‌ ప్లాంట్లు ఉన్నాయి. గతేడాది యాసంగిలో సుమారు 80 వేల ఎకరాల్లో లోకల్‌ సీడ్‌ సాగయింది. కేవలం హుజూరాబాద్‌ డివిజన్‌లోనే 46 వేల ఎకరాలు సాగు చేశారు. ఎక్కువగా 1010 వెరైటీ, కునారం, జేజీఎల్‌ వెరైటీ సన్నాలతో పాటు మొత్తం 30 రకాల వంగడాలకు సంబంధించి ఫౌండేషన్‌ సీడ్‌ ఇచ్చి ప్లాంట్ల యజమానులు సాగు చేయించారు. విత్తనాలను తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. క్వింటాకు రూ.2,800 చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసి.. 30 కిలోల బస్తాకు రూ.150 చొప్పున విత్తనాల ధర పెంచారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో అమ్మకాలు భారీగా పడిపోయినట్లు వారు చెబుతున్నారు. ఒక్కో ప్లాంట్‌కు 15 వేల నుంచి 20 వేల క్వింటాళ్లు మిగిలినట్లు చెప్పారు. ఒక్కో యజమానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి పైగా నష్టం రావడంతో ఈసారి విత్తన సాగును తగ్గించక తప్పలేదంటున్నారు. హుజూరాబాద్‌ డివిజన్‌లో ఈసారి 37 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టారు. సన్నాలకు క్వింటాకు రూ.2,320 మద్దతు ధర, రూ.500 బోనస్‌ చెల్లిస్తుండటంతో రైతులు అటువైపు మళ్లినట్లు తెలుస్తోంది.

ధర తగ్గింపు

ఉమ్మడి జిల్లాలో ఆడ-మగ(హైబ్రీడ్‌) వరి విత్తన సాగు కూడా ఈసారి తగ్గింది. గతేడాది డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో 70 వేల ఎకరాల్లో సాగు చేశారు. కరీంనగర్‌ జిల్లాలోనే 45 వేలు ఉంది. గత యాసంగిలో ఆయా కంపెనీలు క్వింటాకు రూ.1,000 నుంచి రూ.4,000 ధర పెంచడం, విత్తనాలు, వరికోతల ఖర్చులు భరిస్తూ.. దిగుబడి వచ్చినా.. రాకపోయినా ఎకరాకు రూ.80వేలు ఇచ్చేలా ఒప్పంద పత్రాలు ఇచ్చారు. తీరా దిగుబడులు వచ్చిన తర్వాత ఒప్పంద ధర చెల్లించకుండా ఎగ్గొట్టారు. పైగా గతంలో క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.11 వేలు చొప్పున ధర చెల్లించిన కంపెనీలు ఈసారి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు తగ్గించాయి. వెరసి విత్తన సాగుపై రైతులు ఆసక్తి కనబర్చకపోవడంతో ఒక్క హుజూరాబాద్‌ డివిజన్‌లోనే 6,500 ఎకరాల్లో సాగు తగ్గింది.



Source link

Spread the love