మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఎన్నికల వరకే రాజకీయాలని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంచిచేసి వారి మన్ననలు పొందాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలో ఇటీవల ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఖమ్మం నగరపాలక మేయర్, కార్పొరేటర్లకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినవారు మంచిపేరు కోసం తాపత్రయపడాలన్నారు. ఓట్లేసిన ప్రజల మెప్పు పొందాలని సూచించారు. వార్డు, గ్రామం, పట్టణంలో.. ఎవరి పరిధిలో వారు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీ పరిధిలో ఎవరికి అందుతున్నాయి? ఇంకా ఎందరు అర్హులు మిగిలారనే వివరాలు సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలన్నారు. గత రెండున్నరేళ్లుగా నిధుల్లేక వెలవెలబోయిన పంచాయతీలకు నెల రోజులుగా పెద్దఎత్తున విడుదలవుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయి: మంత్రి తుమ్మల
మధ్యాహ్నం సమయంలో సమావేశానికి హాజరైన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయన్నారు. రాజకీయ విమర్శలకు భయపడకుండా ప్రజాసేవలో ఆదర్శంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజాధనం బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలన్నారు. గ్రామాల్లో పచ్చదనంతో పాటు లాభాలు వచ్చేలా రోడ్ల పక్కన కొబ్బరి, మామిడివంటి మొక్కలు నాటాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ విద్యాలత పాల్గొన్నారు.