దివ్యాంగ బాధితురాలికి పరామర్శ

వైద్యసేవలపై ఆరా తీస్తున్న రాయపాటి శైలజ
తుని పట్టణం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని ఓ గ్రామంలో అత్యాచారానికి గురైన 35 ఏళ్ల దివ్యాంగ గిరిజన మహిళను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ బుధవారం పరామర్శించారు. తునిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18న రాత్రి ఆమె అత్యాచారానికి గురవ్వగా అప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్నారని, ప్రాణహాని లేదని వివరించారు. తలకు గాయమై మెదడులో రక్తస్రావం అవ్వడంతో చికిత్స అందించామన్నారు. చెయ్యి, కాలు పక్షవాతానికి గురైందని ఫిజియోథెరపీ చేస్తున్నామన్నారు. తోటలోకి ఒంటరిగా వెళ్తున్న సమయంలో అత్యాచారం జరిగిందని, చెప్పులు ఓ చోట, దుస్తులు మరోచోట ఉండి కొంత దూరంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించామని బాధితురాలి కుటుంబసభ్యులు వివరించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, నిందితులకు కఠిన శిక్ష పడుతుందని వారికి భరోసా ఇచ్చారు. బాధితురాలితో వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేసి దర్యాప్తుపై ఆరా తీశారు. ఐసీడీఎస్ పీడీ సీహెచ్.లక్ష్మి, సీడీపీవో శ్రీలత, సీఐ చెన్నకేశవరావు, గీతా రామకృష్ణలు పాల్గొన్నారు.
ప్రాథమికంగా బాలుడి గుర్తింపు
బాదితురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారని చైర్పర్సన్ విలేకరులకు వివరించారు. బాలుడు చోరీలకు పాల్పడుతుంటాడని తెలిసిందన్నారు. బాధితురాలిని ఒక్కడే తోటలోకి అంతదూరం లాక్కొని వెళ్లగలిగాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది ఆమె సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. మహిళల జోలికివస్తే అదే వారికి చివరిరోజు అవుతుందని ప్రభుత్వం హెచ్చరించడం, పోలీసుల చర్యలతో 4 శాతం నేరాలు తగ్గాయన్నారు. కొందరు తెలిసినవాళ్లు, పరిచయస్తులే దారుణాలకు పాల్పడుతున్నారన్నారు.
కమిషన్‌పై ఏ ఒత్తిడీ లేదు
ఎవరు తప్పుచేసినా కఠినంగానే వ్యవహరిస్తున్నామన్నారు. కమిషన్‌పై ఎటువంటి ఒత్తిడి లేదని, చర్యలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు.