అంతర్జాతీయ జలమార్గాల్లో యుద్ధం చేస్తోంది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలే అయినా.. ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం మా దేశ నావికులు మాత్రమే అంటూ భారత్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. 60 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. హార్మూజ్‌లో ప్రాణాలు కోల్పోయింది మా దేశ నావికులు మాత్రమే అని చెప్పారు. అలాగే ఇరాన్‌లో చిక్కుకున్న 200 మందికి పైగా భారతీయులను అజర్‌బైజాన్ సరిహద్దుల ద్వారా సురక్షితంగా తరలించిన వైనాన్ని వివరించింది.
హైలైట్:
- ఇరాన్ యుద్ధ చర్చల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన భారత్
- హార్మూజ్‌లో నావికుల ప్రాణాలు కోల్పోయింది భారత్ మాత్రమేనంటూ స్పష్టం చేసింది
- 60 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో విక్రమ్ మిస్రీ వెల్లడి

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ కీలక జలమార్గంలో పౌరులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ మాత్రమే. దీన్ని ఉద్దేశించే విక్రమ్ మిస్రీ ఈరకమైన కామెంట్లు చేశారు. అలాగే “అంతర్జాతీయ జలమార్గంలో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడం ఇప్పుడు అత్యంత కీలకం. దౌత్యం, చర్చల ద్వారా ఈ ఉద్రిక్తతలను తగ్గించగలమని భారత్ విశ్వసిస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. మన దేశ ఇంధన అవసరాలు పశ్చిమాసియా దేశాలతో ముడిపడి ఉన్నాయి. హార్మూజ్ జలసంధి మూతపడటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభం కేవలం యుద్ధం చేస్తున్న దేశాలకే కాకుండా భారత్ వంటి దేశాల ఇంధన భద్రతకు పెను సవాలుగా మారిందని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
గల్ఫ్‌లో 10 మిలియన్ల భారతీయుల క్షేమం
యుద్ధం ముదురుతున్నా.. గల్ఫ్ దేశాల్లో దాదాపు ఒక కోటి (10 మిలియన్ల) మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో మొత్తం ఎనిమిది మంది భారతీయులు మరణించారు.. ఒకరు అదృశ్యమయ్యారు. ముఖ్యంగా ఇరాన్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు భారత్ ‘అజర్‌బైజాన్’ భూభాగం ద్వారా ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇలా ఇప్పటి వరకు 204 మంది భారతీయులను అజర్‌బైజాన్ సరిహద్దుల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
