Middle East War : ఇంగ్లాండులో వర్షం పడితే ఇండియాలో గొడుకు పట్టినట్లున్నది మన పరిస్థితి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం మూలంగా మనదేశంలో అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ పై విపరీతమైన ప్రభావం పడటంతో అన్ని రకాల హోటల్స్, రెస్టారెంట్లు ధరలు పెంచుతున్నారు. దీంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. తాజాగా ఈ వార్ మందుబాబులకు శాపంగా పరిణమించనుంది. అంతర్జాతీయంగా సప్లై చైన్‌లో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా భారత్‌లోని మద్యం బాటిళ్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనక జరిగితే భవిష్యత్తులో మద్యం ధరలు పెరగడం ఖాయంగా మారింది. దీనితో మందుబాబుల జేబులు చిల్లు పడక తప్పదు. దీంతో ఈ వేసవిలో చల్లగా చిల్ అవుదామనుకునే మందుబాబుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని.
యుద్ధం మూలంగా ప్రస్తుత మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకు కంటే ప్యాకేజీ ఖర్చే కంపెనీలకు భారమవుతోంది. మద్యం బాటిళ్లు తయారు చేయడానికి గాజు ఫర్నెస్(కొలిమి)లను ఎల్లపుడు మండించాల్సి ఉంటుంది. దీనికి గ్యాస్ తప్పనిసరిగా అవసరం. అయితే మనదేశం తన సహజవాయువు అవసరాల కోసం 40 శాతం వరకు ఖతార్‌పైనే ఆధారపడుతోంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. నిజానికి బీర్ తయారీ కంటే దాని ప్యాకేజింగ్ వాటా 40 శాతం. కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాల్లో) ఇది 20 శాతం వరకు ఉంటుంది. గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడటం వల్ల అది నేరుగా గాజు బాటిళ్ల తయారీపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పెరిగిన గ్యాస్ కష్టాలు, కమర్షియల్ గ్యాస్ ధరల వల్ల గాజు బాటిళ్ల ధర 15-20 శాతం పెరినట్లు ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ చోప్రా చెబుతున్నారు.
వీటికి అదనంగా షిప్పింగ్ చార్జీలు పెరగడంతో మద్యం తయారీ కంపెనీలు అదనంగా 10-15 శాతం మద్యం ధరలు పెంచాలని ఆయన కోరారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఇలాగే కంటిన్యూ అయితే గాజులు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవని, అదే గనుక జరిగితే బాటిళ్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఈ వేసవిలో ఏర్పడే డిమాండ్‌కు తగినట్లు సరఫరా ఉండకూడదని మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్దీప్ సింగ్ హెచ్చరించారు. వీటికి తోడు అల్యూమినియం ధరలు సైతం 15 శాతం పెరగడం వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరలు ఇలాగే పెరిగితే మద్యం ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మద్యం తయారీ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.