cyber crime: ఫోన్‌ కొట్టేస్తారు.. ‘ఖాతా’ కొల్లగొట్టేస్తారు


మాజీ ప్రభుత్వోద్యోగి.. హైదరాబాద్‌ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన అతనికి ఇటీవల పోలీసులు ఫోన్‌ చేశారు. ‘మీ ఫోన్‌ ద్వారా సైబర్‌ నేరం జరిగింది’ అని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇటీవల కర్ణాటకలో నమోదైన సైబర్‌ నేరానికి సంబంధించి బాధితుడి డబ్బు మీ యూపీఐ ఖాతాలో జమ అయింది.. అక్కడినుంచి వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. ఇలా ఖాతా అద్దెకు ఇవ్వడం నేరం కాబట్టి మీపై కేసు నమోదు చేస్తున్నాం’ అని చెప్పారు. దాంతో ఆ మాజీ ఉద్యోగి పది రోజుల క్రితమే తన ఫోన్‌ పోయిందని, ఫలానా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని చెబుతూ ఆధారాలు సమర్పించారు. దాంతో పోలీసులు అతన్ని పంపించివేశారు.

సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలో ఇలా అమాయకులను ఇరికించడంతోపాటు అందినకాడికి దోచుకుంటున్నారు. మోసగాళ్లు మాయమాటలతో కొట్టేసిన డబ్బును దారి మళ్లించేందుకు దేశవ్యాప్తంగా మ్యూల్‌ ఖాతాలను సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిందే. దోచుకున్న డబ్బును తొలుత ఈ ఖాతాల్లోకి.. అక్కడినుంచి వేరే ఖాతాల్లోకి పంపించి డ్రా చేసుకుంటున్నారు. లేదంటే క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు మళ్లిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేయగానే వారి ఖాతాల నుంచి డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో గుర్తించి, ఆయా ఖాతాదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఖాతాలు సమకూర్చుకోవడం సైబర్‌ నేరగాళ్లకు కష్టమవుతోంది. దీంతో ఇప్పుడు వారు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఫోన్లు కొట్టేసి, వాటిలో ఉన్న యూపీఐ ఖాతాలను సైబర్‌ నేరాలకు వాడుకుంటున్నారు.


ఏం చేస్తున్నారంటే..!

ఇప్పుడు యూపీఐ చెల్లింపులు సాధారణమైపోయాయి. గూగుల్‌పే, ఫోన్‌పే వంటివి వాడటం మామూలయింది. రూపాయి వస్తువు కొన్నా ఫోన్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దీంతో రద్దీగా ఉండే దుకాణాలు, వాణిజ్య సముదాయాల వద్ద ఫోన్లు చోరీచేసే ముఠాలు మాటు వేస్తున్నాయి. ఎవరైనా ఫోన్‌ద్వారా చెల్లింపులు జరిపేటప్పుడు ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా వారు ఎంటర్‌చేసే పిన్‌ నంబరు చూస్తున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోవడంతోపాటు ఆ వ్యక్తిని వెంటాడుతూ అదనుచూసి ఫోన్‌ కొట్టేస్తున్నారు. ఒకే వ్యక్తి అనుసరిస్తుంటే అనుమానం వస్తుంది కాబట్టి ముగ్గురు, నలుగురు కలిసి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఒకసారి ఫోన్‌ చేతికి చిక్కిన తర్వాత పిన్‌ నంబరు తెలుసు కాబట్టి నేరగాళ్లు ముందు అందులోని డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అనంతరం ఆ ఫోన్‌ నంబరును సైబర్‌ నేరాల ముఠాకు ఇస్తున్నారు. ఎక్కడెక్కడో కొట్టేసిన డబ్బును ఆ ఫోన్లో ఉన్న యూపీఐకి, అక్కడి నుంచి వేర్వేరు ఖాతాలకు పంపుతున్నారు. ఫోన్‌ పోగొట్టుకున్న బాధితుడు తన ఖాతాను స్తంభింపజేసేవరకూ ఇది జరుగుతూనే ఉంటుంది. సైబర్‌ నేరాలకు సంబంధించిన లావాదేవీలు ఈ ఫోన్‌ద్వారా జరిగాయి కాబట్టి పోలీసులు ఆ ఫోన్‌ యజమానిని ప్రశ్నిస్తున్నారు.


ఏం చేయాలంటే..!

  • యూపీఐ చెల్లింపులు జరిపేటప్పుడు పిన్‌ నంబరు ఎవరూ గమనించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఒకవేళ ఫోన్‌ చోరీ అయితే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఖాతాను స్తంభింపజేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌లో లావాదేవీలకు సంబంధించి వీలైనంత తక్కువ మొత్తానికి పరిమితి పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు దాన్ని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా తక్కువ పరిమితి పెట్టుకుంటే నేరగాళ్లు అంతకుమించి బదిలీ చేయలేరు.
  • ఫోన్‌ పోతే తక్షణమే దగ్గరలోని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆలస్యం చేస్తున్న కొద్దీ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈనాడు, హైదరాబాద్‌



Source link

Spread the love