మేం ధాన్యం సేకరణ పెంచుతుంటే.. మీరు సీఎంఆర్‌ లక్ష్యాన్ని తగ్గిస్తారా?


అదనపు ధాన్యంతో తెలంగాణపై ఆర్థికభారం

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో లక్షల మంది రైతుల ప్రయోజనాల్ని కాపాడాలంటే ధాన్యం కొనుగోలును నిరంతరం కొనసాగాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పెంచుతుంటే కేంద్రం మాత్రం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) లక్ష్యాన్ని తగ్గిస్తోందని పేర్కొన్నారు. అదనపు ధాన్యం సేకరణ కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషికి ఉత్తమ్‌ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. కేంద్రం నుంచి సరైన మద్దతు లేకపోతే అధిక ధాన్యం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కాలం భరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా కాపాడేందుకు బాయిల్డ్‌ రైస్‌ సేకరణ లక్ష్యాల పెంపు, గడువు పొడిగింపు సహా పలు డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్, బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాల్ని తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం నిల్వ సమస్యలు, మిల్లింగ్‌ ఖర్చులు, వడ్డీ భారాలు పెరుగుతున్నాయని తెలిపారు.

2023 తర్వాత భారీగా ఉత్పత్తి, సేకరణ

‘‘తెలంగాణలో 2023 తర్వాత నీటిపారుదల సదుపాయాలు పెరగడంతో ఖరీఫ్, రబీలో వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం భారీగా వడ్లను సేకరిస్తోంది. రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా నివారిస్తున్నాం. 2024-25 రబీకి సంబంధించి ఎఫ్‌సీఐకి ఇంకా 8.45 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. దీనికి మరో రెండు నెలల గడువు ఇవ్వాలి.

  • తెలంగాణ వడ్ల నాణ్యత, తక్కువ తేమ శాతం కారణంగా బాయిల్డ్‌ రైస్‌ తయారీకి అనుకూలం. రైస్‌మిల్లర్లు కూడా 5 శాతం నూకల(బ్రోకెన్‌)తో ఇవ్వడానికి అంగీకరించారు.
  • 2024-25 రబీ సీజన్‌కు ఎఫ్‌సీఐ రా రైస్‌ లక్ష్యాన్ని తగ్గించాలి. దానికి బదులు కనీసం 5 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాన్ని కేటాయించాలి.
  • రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది. 20 లక్షల టన్నులుగా ఉన్న బాయిల్డ్‌ రైస్‌ లక్ష్యాన్ని 2025-26 సీజన్‌కు 40 లక్షల టన్నులకు పెంచాలి’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ లేఖలో వివరించారు.



Source link

Spread the love