నార్సింగి పీఎస్‌లో న్యాయవాది సింగబోష్‌పై మంగ్లీ ఫిర్యాదు


LIVE FEED

4:56 PM, 11 Apr 2026 (IST)

ఆసుపత్రిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు హైదరాబాద్‌ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. గత 5 రోజులుగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భాస్కర్‌రావు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

3:59 PM, 11 Apr 2026 (IST)

నార్సింగి పీఎస్‌లో న్యాయవాది సింగబోష్‌పై మంగ్లీ ఫిర్యాదు

  • హైదరాబాద్ నార్సింగి పీఎస్‌లో న్యాయవాది సుభా సింగబోష్‌పై మంగ్లీ ఫిర్యాదు చేశారు. సుభా సింగబోష్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మంగ్లీ ఆరోపించారు. తాను రూ.150 కోట్ల మేర మోసం చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, తనను కలవకపోతే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నార్సింగి పోలీసులు సుభా సింగబోష్‌పై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 79, 351(3) కింద కేసు నమోదు చేశారు.

3:54 PM, 11 Apr 2026 (IST)

ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100స్థానాలు గెలుస్తుంది: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

  • ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలైందని, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ములుగులో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

2:16 PM, 11 Apr 2026 (IST)

నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్‌

  • రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అవసరం ఉందన్నారు బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. వచ్చేది తమ ప్రభుత్వమేనని తనకు నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదని, ఆరు గ్యారెంటీల అమలు జరగడం లేదని, ఇక రేవంత్ సర్కార్ అరాచకాలు అన్నిఇన్ని కావన్నారు. దిల్లీకి సీఎం ఎన్నిసార్లు వెళ్లారో.. ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు తెలుసని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

2:14 PM, 11 Apr 2026 (IST)

ఖైరతాబాద్ చింతల్‌బస్తీ వద్ద శ్రీసాయినిలయంలో అగ్నిప్రమాదం

  • ఖైరతాబాద్ చింతల్ బస్తీ రామలీలా గ్రౌండ్ ఎదురుగా ఉన్న శ్రీ సాయి నిలయంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మెట్ల కింద ఉన్న ఎలక్ట్రికల్ మీటర్ ప్రాంతంలో మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసి భవనంలో ఉన్న అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో మొత్తం 17 మందిని సురక్షితంగా కాపాడారు.

2:14 PM, 11 Apr 2026 (IST)

కాంగ్రెస్‌ పార్టీ అందరిదీ: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కాంగ్రెస్‌ పార్టీ అందరిదన్నారు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ .. జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

1:38 PM, 11 Apr 2026 (IST)

వాహనాల్లో డీజిల్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్టు

  • నల్గొండ పట్టణంలో వాహనాల్లో డీజిల్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్​లో మొత్తం ఆరుగురు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 1,000 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు రెండు వాహనాలు, 6 ఫోన్లను కూడా పోలీసులు రికవరీ చేశారు.

1:38 PM, 11 Apr 2026 (IST)

శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల బుకింగ్‌కు అంతరాయం

  • శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల బుకింగ్‌ జరగడం లేదు. బుక్‌ చేసిన టికెట్లు డౌన్‌లోడ్‌ కాక భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. www.srisailadevasthanam.org ద్వారా దర్శనం, సేవల బుకింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇవాళ టికెట్లు బుక్ చేసినా డౌన్​లోడ్ కాకపోవడంతో పాటు, బుకింగ్ హిస్టరీలో టికెట్లు చూపించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ సమస్య ఉన్నట్లు చెబుతున్న ఆలయ వర్గాలు తెలిపాయి.

1:29 PM, 11 Apr 2026 (IST)

ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు: రంగనాథ్‌

  • ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ స్పష్టం చేశారు. హైకోర్టు స్టేను హైడ్రా ఉల్లంఘించిందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 1998 నుంచి ఈ భూములపై హైకోర్టులో స్టేటస్ కో ఉందన్నారు. ముఖీమ్ ఈ భూములను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించుకోవడమే కాకుండా 100 గజాలు పదిలక్షలకు విక్రయించి కోట్ల సంపాదిండాలని తెలిపారు. ఇవాళ పేదలు నిర్మించుకున్న భూములు కాకుండా ముఖీమ్ ఆక్రమించుకున్న భూములను తిరిగి ప్రభుత్వపరం చేశామన్నారు.

12:04 PM, 11 Apr 2026 (IST)

రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు

  • రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు తీవ్రమయ్యాయి. పంపిణీ ఆలస్యం కావడం, సర్వర్ స్లో, బియ్యం అయిపోవడం రకరకాల కారణాలతో రేషన్ బియ్యం పంపిణీ ఆలస్యంగా సాగుతోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల చౌకధరల దుకాణాల వద్ద కార్డుదారుల రద్దీ నెలకొంది. 3 నెలల బియ్యానికి బయోమెట్రిక్ థంబ్ మూడుసార్లు తీసుకోవాల్సి వస్తుండటంతో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. దీనికి సర్వర్ స్లో ఉందన్న సాంకేతిక కారణాలు తోడయ్యాయి. దీంతో షాపుల వద్ద లబ్ధిదారులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. కొన్ని చోట్ల టోకెన్ సిస్టమ్ పెట్టడంతో మిగతా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం జరిగినా ఈనెల 30 వరకు కాకుండా గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

12:03 PM, 11 Apr 2026 (IST)

ముఖీమ్ ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకోవడంతో స్థానికుల సంబరాలు

  • ముఖీమ్ ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకోవడంతో స్థానికుల సంబరాలు జరుపుకున్నారు. తమ లేఅవుట్‌లు కబ్జా చేసి ముఖీమ్‌ విక్రయించారన్న స్థానికులు గతంలో ఆరోపించారు. ఇవాళ హైడ్రా రంగంలోకి దిగి ముఖీమ్ ఆక్రమణలు తొలగించినందుకు స్థానికులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

11:41 AM, 11 Apr 2026 (IST)

సూర్యాపేట: కోదాడ మండలం తమ్మరబండలో రైతుల నిరసన

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండలో రైతులు నిరసనకు దిగారు. కోదాడ- ఖమ్మం ఎన్‌హెచ్‌పై రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దాంతో కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

11:39 AM, 11 Apr 2026 (IST)

ఎక్సైజ్ కమిషనర్‌ తీరును ఖండించిన ఉద్యోగుల సంఘం జేఏసీ

ఎక్సైజ్ కమిషనర్‌ తీరును ఉద్యోగుల సంఘం జేఏసీ ఖండించింది. 30 ఏళ్లుగా సేవలందిస్తున్న సోమిరెడ్డిని దూషించడాన్ని ఖండిస్తున్నామని, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. ఎక్సైజ్​ శాఖ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని, ప్రత్యేక క‌మిటీ ఏర్పాటు చేసి విచార‌ణ జ‌రపాలని కోరింది.

11:38 AM, 11 Apr 2026 (IST)

గ్రేటర్ సైబరాబాద్ పరిధిలో మణికొండలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు

గ్రేటర్ సైబరాబాద్ పరిధిలోని మణికొండలో ఫుట్‌ పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. ఫుట్‌పాత్‌, రహదారులపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను జీహెచ్​ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫుట్‌పాత్‌లపై ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

11:32 AM, 11 Apr 2026 (IST)

ఎక్సైజ్‌ కమిషనర్‌, అధికారుల మధ్య వివాదం

ఎక్సైజ్​ కమిషనర్‌, అధికారుల మధ్య వివాదం కలకలం రేపుతోంది. ఎక్సైజ్ కమిషనర్‌ వేధిస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. కమిషనర్‌ దుర్భాషలాడటం వల్ల ఆస్పత్రి పాలైనట్లు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సోమిరెడ్డి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఉన్నతాధికారుల వేధింపులపై వాట్సాప్‌ గ్రూపులో పోస్టు పెట్టిన డీసీ, కమిషనర్‌ తీరు చూస్తే తనలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడలేరని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పునకు దూషించారంటూ వీడియోలో తెలిపారు. అధికారులు, సిబ్బంది ముందే కమిషనర్‌ తిట్టడంతో మానసిక వేదనకు లోనయ్యానని, అక్కడే కుప్పకూలిపోవడంతో తన మిత్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో బతికి బయటపడ్డానని చెప్పుకొచ్చారు.

10:30 AM, 11 Apr 2026 (IST)

సంగారెడ్డి : అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఐలాపూర్‌లో ఆక్రమణలు తొలగింపు చేపడుతోంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన ముఖీమ్‌ గెస్ట్‌హౌస్​ను కూల్చివేసింది. ముఖీమ్‌ సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. ఈ మేరకు ఖాళీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటుంది. ఐలాపురంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ప్రభుత్వ భూమిలో పేదల నివాసాల జోలికి వెళ్లకుండా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడుతోంది. 860 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

10:25 AM, 11 Apr 2026 (IST)

హైదరాబాద్‌ : మణికొండలో అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ మణికొండలో ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి కిందపడి మృతి చెందాడు. మృతుడు బిహార్‌కు చెందిన వలస కార్మికుడిగా గుర్తించిన నార్సింగి పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10:21 AM, 11 Apr 2026 (IST)

ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం

ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాక్ గార్డెన్స్ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందాడు. మెహిదీపట్నంనకు చెందిన జోగేశ్​(14) తన ఐదుగురు స్నేహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో అతడు అకస్మాత్తుగా నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

9:35 AM, 11 Apr 2026 (IST)

మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్ల మోసం – గాయకురాలు మంగ్లీపై కేసు నమోదు

సినీ గాయకురాలు మంగ్లీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్లు మోసం చేసినట్లు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9:06 AM, 11 Apr 2026 (IST)

సంగారెడ్డి: అమీన్‌పూర్ మం. ఐలాపూర్‌లో భారీగా మోహరించిన హైడ్రా సిబ్బంది

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో భారీగా హైడ్రా సిబ్బంది మోహరించింది. కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములు గుర్తించి ఫెన్సింగ్ వేసే అవకాశం ఉందని హైడ్రా అధికారులు తెలిపారు. ఘర్షణ వాతావరణం ఉండటంతో పోలీసులు భారీగా బందోబస్తు చేశారు. ఐలాపూర్​ కె.ఎ. రెసిడెన్సి ప్రహరీని హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. మొత్తం 44 కుటుంబాలను అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నారు.

9:06 AM, 11 Apr 2026 (IST)

కామారెడ్డి జిల్లా : లింగంపేట మండలం శెట్పల్లిలో పెళ్లింట విషాదం

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లిలో పెళ్లింట విషాదం జరిగింది. కుమారుడి పెళ్లి కోసం సామగ్రి తీసుకువస్తుండగా ప్రమాదం, తండ్రి మృతి చెందారు. బైకుపై వెళ్తున్న దుర్గయ్యను ఢీకొన్న లారీ, అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు రోజుల్లో కుమారుడు పెళ్లి జరగాల్సి ఉండగా తండ్రి మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.

9:06 AM, 11 Apr 2026 (IST)

హైదరాబాద్‌: మంగళహాట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు

హైదరాబాద్‌లో మంగళహాట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఇందులో మొత్తం 200 మంది పోలీసులతో 7 కమర్షియల్, 10 డొమెస్టిక్, 79 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు ఆటోల్లో తరలిస్తున్న 15 చిన్న సిలిండర్లు పట్టివేత అలాగే బెల్ట్‌షాపులపై దాడి, 42 లీటర్ల బీర్‌, 8 లీటర్ల విస్కీ స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు లేని 28 ద్విచక్రవాహనాలు సీజ్ చేశారు.

9:05 AM, 11 Apr 2026 (IST)

హైదరాబాద్‌: వనస్థలిపురం శారదానగర్‌లోని ఆలయంలో చోరీ

హైదరాబాద్‌లో వనస్థలిపురం శారదానగర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరగడంతో ఘటనపై ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

9:05 AM, 11 Apr 2026 (IST)

సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో భారీగా మోహరించిన హైడ్రా సిబ్బంది

సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో భారీగా హైడ్రా సిబ్బంది మోహరించింది. బహిరంగ భూమికి ఫెన్సింగ్ వేసేందుకు ఐలాపూర్‌కు హైడ్రా సిబ్బంగా ఉంది. ప్రభుత్వ స్థలంలో అనధికారికంగా నిర్మించిన భవనాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. హైడ్రా వెయ్యి మంది, పోలీసులు వెయ్యిమంది సిబ్బంది మోహరించింది.

9:05 AM, 11 Apr 2026 (IST)

సూర్యాపేట: కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 16 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింతారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

7:10 AM, 11 Apr 2026 (IST)

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 65,534 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 24,560 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు.

7:06 AM, 11 Apr 2026 (IST)

భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2

చంద్రుడి వద్దకు వెళ్లివచ్చిన ఆర్టెమిస్-2 విజయవంతంగా భూమిని చేరింది. ఒరాయన్ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. ఉదయం 5.38 గంటలకు శాన్‌డియాగో తీరంలో ఒరాయన్ క్యాప్సూల్‌ స్ప్లాష్‌డౌన్‌ అయింది. నలుగురు వ్యోమగాములు పసిఫిక్‌ మహాసముద్రంలో సురక్షితంగా దిగారు. ఆర్టెమిస్-2లో వైజ్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా, జెరెమీ హాన్సెన్ వ్యోమగాములు ఉన్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అర్ధ శతాబ్దం తర్వాత వ్యోమగాములు చంద్రుడి చెంతకు వెళ్లొచ్చారు.

6:59 AM, 11 Apr 2026 (IST)

కామారెడ్డి జిల్లాలో అంబులెన్స్‌ను ఢీకొట్టిన బస్సు – ఇద్దరు మృతి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్‌ని వెనక నుంచి బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను బస్సు ఢీకొనగా, ప్రమాదంలో సలేహ భాను(63), అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన సైఫుల్ల ఖాన్‌ (76)కు తీవ్ర గాయాలయ్యాయి.

6:45 AM, 11 Apr 2026 (IST)

నేడు నిజామాబాద్ జిల్లాకు రానున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

నేడు నిజామాబాద్ జిల్లాకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) రానున్నారు. కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భగవత్ ప్రారంభించనున్నారు.
స్ఫూర్తి మందిరంలో ఛాయ చిత్రాల ప్రదర్శనను తిలకించి అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సభలో పాల్గొననున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు భగవత్ రాక దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

6:41 AM, 11 Apr 2026 (IST)

నల్గొండ జిల్లా: తనపై మేనమామ లైంగికదాడికి పాల్పడుతున్నాడని పోలీసులకు యువతి ఫిర్యాదు

నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలంలోని వ్యక్తిపై యువతి ఫిర్యాదు చేసింది. తనపై మేనమామ లైంగికదాడికి పాల్పడుతున్నాడని యువతి ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువతి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు ఎల్బీనగర్ పీఎస్‌కు వెళ్లి మేనమామపై ఫిర్యాదు చేసింది. కేసును ఎల్బీనగర్​ పోలీసులు వేములపల్లి పీఎస్‌కు బదిలీ చేశారు. నిందితుడు నాగేంద్రపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

6:39 AM, 11 Apr 2026 (IST)

ఇవాళ ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు

ఇవాళ ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు (IPL Today Match ) జరగనున్నాయి. నేడు చండీగఢ్​లో మధ్యాహ్నం 3.30 నుంచి పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (PBKS VS SRH) మ్యాచ్‌ జరగనుంది. మరో మ్యాచ్​ చెన్నైలో రాత్రి 7.30 చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ (CSK VS DC) మధ్య జరగనుంది.

6:36 AM, 11 Apr 2026 (IST)

ఐపీఎల్‌: బెంగళూరుపై రాజస్థాన్‌ విజయం

ఐపీఎల్‌ : నిన్న రాత్రి ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై రాజస్థాన్‌ గెలుపొందింది. స్కోర్లు: బెంగళూరు 201/8, రాజస్థాన్‌ 202/4



Source link

Spread the love