తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కృష్ణా బోర్డు లేఖలు
ఈనాడు, హైదరాబాద్: ‘వేతనాలకు, నిర్వహణకు నిధుల్లేవు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు బడ్జెట్ ఇవ్వడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే టెలిమెట్రీల ఏర్పాటుకు తెలంగాణ కేటాయించిన నిధులు వినియోగించుకోవాల్సి వస్తోంది’ అంటూ కృష్ణా బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖలకు శుక్రవారం లేఖలు రాసినట్లు తెలిసింది. ఇటీవల ఈఎన్సీ అంజద్ హుస్సేన్ బోర్డుకు రాసిన లేఖలో వేతనాలు, టెలిమెట్రీలకు నిధుల కేటాయింపును వేర్వేరుగా చూడాలని స్పష్టం చేయడంతో బోర్డు స్పందించినట్లు సమాచారం. ‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు యాభై శాతం నిష్పత్తిలో నిధులు కేటాయించాలి. 2024-25 సంవత్సరానికి రూ.23.17 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించగా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. 2025-26కు రూ.24 కోట్లు అవసరమని అంచనా వేయగా పైసా విడుదల చేయలేదు. గతేడాది జనవరిలో జరిగిన బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు రూ.12 కోట్ల చొప్పున విడుదల చేయడానికి అంగీకారం కుదిరినా నిధులు ఇవ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ రెండోదశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు కేటాయించిన నిధులను మళ్లించుకుంటున్నాం’ అని బోర్డు పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పటికైనా తెలంగాణ, ఏపీ బడ్జెట్‌ను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం.