TG Cabinet: 18న మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం


ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ‘సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర’ ఈ నెల 28న ప్రారంభం కానుండడంతో.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో క్యాబినెట్‌ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత క్యాబినెట్‌ సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్‌కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశముంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైనా క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండడంతో.. అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతుభరోసా నిధుల విడుదల, హ్యామ్‌ రోడ్లు, తదితర అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.



Source link

Spread the love