తెలంగాణ తాజా వార్తలు: తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగున ఉన్న నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. రాష్ట్రంలోని అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కేరళ రాష్ట్రంలో విజయవంతమైన నమూనాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ ప్రతిష్టాత్మక బాధ్యతను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థకు అప్పగించగా, ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధమయ్యాయి.
అట్టడుగున ఉన్న 8వేల కుటుంబాల గుర్తింపు
తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం కింద ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్వహించింది. ఐదు జిల్లాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో చేపట్టిన ఈ ప్రాథమిక సర్వేలో సుమారు 8వేల నిరుపేద కుటుంబాలను గుర్తించినట్టు సమాచారం. ఈ ఫలితాల ఆధారంగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ అత్యంత నిరుపేదలను గుర్తించేందుకు ఒక సమగ్ర ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపించారు.
ప్రజాభాగస్వామ్యంతోనే సర్వే
ఈ సర్వే గతంలో జరిగిన సర్వేల కంటే భిన్నంగా ఉండబోతోంది. కేవలం గణాంకాలతో కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ జరగనుంది. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు కాలినడకన ప్రతి వీధిని సందర్శిస్తారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ చిత్ర పటాన్ని రూపొందిస్తారు. ఈ పటంలో పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు, గుడిసెల బొమ్మలు గీస్తారు. ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు. వారి సామాజిక స్థితిగతులు ఏంటి అనేది కార్డులపై రాసి ఆయా ఇళ్ల బొమ్మలపై ఉంచుతారు. స్థానికులందరి సమక్షంలో చర్చించి, అత్యంత పేద కుటుంబాల ప్రాథమిక జాబితాను సిద్ధం చేస్తారు. అనంతరం సదరు కుటుంబాల వద్దకు నేరుగా వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియను 2011 జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు.
మూడు దశల్లో ధ్రువీకరణ
అనర్హులకు చోటు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కఠినమైన ధ్రువీకరణ ప్రక్రియను రూపొందించింది. గ్రామస్థాయి జాబితాను మండల సమాఖ్యకు పంపిస్తారు. అక్కడి నుంచి నలుగురు ప్రతినిధులు వచ్చి ఇళ్లను స్వయంగా తనిఖీ చేస్తారు. కుటుంబ ఆదాయం, ఆహార భద్రత, జీవన స్థితిగతులను పరిశీలిస్తారు. ఈ జాబితాను ఎంపీడీవోలు పరిశీలించిన తర్వాత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు అందజేస్తారు. చివరగా జిల్లా కలెక్టర్ దీనిని అధికారికంగా ప్రకటిస్తారు. ఎవరైనా అర్హులు జాబితాలో లేకపోయినా లేదా అనర్హులు చేరినా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఎవరు అర్హులు? ప్రాధాన్యత ఎవరికి?
ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలైన చెంచు, కోలం, జోగిని కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లతోపాటు సొంత ఇల్లు, లేదా స్థలం లేని వారు, మట్టి గోడలున్న ఒకే గది ఇంట్లో నివసించే వారు కూడా అర్హులు. సాగు భూమి లేనివారు, రోజు వారీ కూలీపై ఆధారపడేవాళ్లు. వితంతువులు, విడిపోయిన మహిళలు, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు, ట్రాన్స్ జెండర్లు, చెత్త సేకరించవారు. పారిశుద్ధ్య కార్మికులు, క్యాన్సర్ లేదా టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు కూడా ఈ పథకానికి అర్హులు. దివ్యాంగులు ఉన్న కుటుంబాలు, బాలకార్మికులు ఉన్న నిరుపేద కుటుంబాలు కూడా అర్హులని ప్రభుత్వం వెల్లడించింది.
అనర్హులు ఎవరు?
సర్వేలో పారదర్శకత కోసం ప్రభుత్వం కొన్ని కఠినమైన పరిమితులను విధించింది. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్న , నెలకు పదివేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు అన్హరులు. ఆదాయపు పన్ను చెల్లించే వారు, కారు, ట్రాక్టర్, జీపు వంటి వాహనాలు ఉన్న వారు ఈ జాబితాలోకి రారు. 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి ఉన్న వారిని, బోరు బావి సౌకర్యం ఉన్న వారిని పథకం నుంచి మినహాయించారు. బ్యాంకుల్లో యాభై వేల కంటే ఎక్కువ రుణం కలిగిన ఉన్న వారు కూడా దీనికి అనర్హులని సెర్ప్ ప్రకటించింది.
ఇంకా చదవండి