టీ – 20 వరల్డ్‌కప్ 2026 ముందు బంగ్లాదేశ్ గందరగోళం, ఐపీఎల్ వివాదంతో మొదలై పెద్ద రగడగా మారింది. భద్రతా కారణాలతో భారత్‌లో ఆడబోమని తేల్చి చెప్పిన బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ మద్దతు తెలపడంతో ఐసీసీకి కొత్త తలనొప్పి. శ్రీలంకలో మ్యాచ్‌లు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తుండగా, ఈ వివాదం టోర్నీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. బంగ్లాదేశ్‌కు సరైన న్యాయం జరగకపోతే తాము టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలో లేదో ఆలోచిస్తామని పాకిస్థాన్ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.
హైలైట్:
- బంగ్లాదేశ్ వేదికల మార్పు విషయంలో పాకిస్తాన్ సపోర్ట్
- న్యాయం జరగకపోతే తాము ఆడబోమంటూ లేఖ రాసిన పీసీబీ
- ఫిబ్రవరి 7 నుంచి టీ 20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం

ఈ వివాదానికి ప్రధాన కారణంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ అంశమే అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాల్సిన ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ సూచనలతో ఆఫ్రాంచైజీ విడుదల చేయడం బలాదేశ్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. భారత్‌లో జరిగిన కొన్ని పరిణామాలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీసీబీ వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వొచ్చన్న ప్రతిపాదన కూడా చర్చకు వచ్చినట్టు అనధికారిక సమాచారం. అంతేకాదు, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పిస్తే, పాకిస్థాన్ కూడా టోర్నీలో ఆడాలో ఒద్దో పునఃసమీక్షించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్లో అంతర్గత సంక్షోభం పరిస్థితి మరింత స్పష్టంగా మారింది. బీసీబీ ఫైనాన్స్ కమిటీ మాజీ చైర్మన్ ఎం. నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే ఎలాంటి పారితోషికం ఉంటుందోనని, పైగా బోర్డు ఖర్చు చేసిన కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చాడు. అదే కాకుండా వరల్డ్ కప్‌లో ఆడాలని సూచించిన మాజీ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్‌ను ఇండియన్ ఏజెంట్‌గా వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నజ్ముల్ ఇస్లాం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
మొత్తానికి, టీ20 వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ – ఐసీసీ వివాదంలో పాకిస్థాన్ జోక్యం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఐసీసీ తీసుకునే తుది నిర్ణయం ఈ టోర్నీ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఆడేదానిపై క్లారిటీ లేదు. ఐసీసీ డెడ్‌లైన్ ప్రకారం ఇవాల్టితో ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
