
హైదరాబాద్: మహానగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు హెచ్ఎండీఏ కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రూ.వందల కోట్ల ప్రాజెక్టులకు పరిపాలనపరమైన అనుమతులను మంజూరు చేసింది. హైదరాబాద్‌కు ‘గేట్ వే’లా బుద్వేల్ వద్ద ప్రపంచస్థాయి ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్‌కు అంతర్గత నిధులతోపాటు రూ.488 కోట్లు, బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్-3 నిర్మాణం కోసం రూ.1,656 కోట్లు, ఎంజీఐటీ వద్ద శంకర్‌పల్లి రోడ్డు నుంచి మణికొండ వరకు పైపులైన్ రోడ్ విస్తరణకు రూ.110 కోట్లు, నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్‌ఆర్ ఎడమ వైపు ప్రధాన రహదారి విస్తరణకు రూ.26.50 కోట్ల పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చినట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. ఈ కీలక ప్రాజెక్టులు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.