
ఫిబ్రవరి 1.. ఉదయం 11 గంటలు.. ఏటా దేశవ్యాప్తంగా కోట్లమంది టీవీలకు/ఫోన్లకు అతుక్కుపోయే సమయమది! – వృద్ధి పథంలో దేశ గమనానికి దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేది అప్పుడే. సుదీర్ఘంగా సాగే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని చాలామంది ఉత్కంఠ నడుమ ఆలకిస్తుంటారు. ఆ ముహూర్తం మళ్లీ వచ్చేందుకు మిగిలి ఉన్నది ఇంకో మూడు రోజులే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పద్దులకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలివీ..
జేమ్స్ విల్సన్ తెలుసా..?

జేమ్స్ విల్సన్
భారత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది భారతీయుడు కాదు! ఈస్టిండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న అప్పటి బ్రిటన్ రాణికి భారత మొట్టమొదటి బడ్జెట్‌ను సమర్పించారు. స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్‌ను (1947 నవంబరు 26న) ప్రవేశపెట్టిన ఘనత ఆర్.కె.షణ్ముఖం చెట్టుకి దక్కింది.
ప్రధానుల పద్దులు

1958, 1970, 1987 బడ్జెట్లకు ప్రత్యేకత ఉంది. ఈ మూడు సంవత్సరాల్లోనూ ప్రధానమంత్రిలే స్వయంగా పార్లమెంటులో పద్దును ప్రవేశపెట్టారు. ఆ సమయంలో వారే ఆర్థిక మంత్రులుగానూ ఉండేందుకు కారణం. టి.టి.కృష్ణమాచారి రాజీనామాతో 1958లో జవహర్లాల్ నెహ్రూ.. మొరార్జీ దేశాయ్ రాజీనామాతో 1970లో ఇందిరాగాంధీ.. వి.పి.సింగ్ రాజీనామాతో 1987లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రులుగా ఉంటూనే ఆర్థిక మంత్రి అవతారమెత్తి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
నిర్మలమ్మ.. వరుసగా తొమ్మిదోసారి

నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇది వరుసగా తొమ్మిదోసారి. ఇప్పటివరకూ దేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్లు (10) ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ సొంతం. ఆయన తర్వాత స్థానంలో ఉన్న పి.చిదంబరం (9)ను ఆదివారంతో నిర్మల సమం చేయనున్నారు. అయితే వరుసగా ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మాత్రం ఇప్పటికే ఈమె సొంతం.
ఆ బడ్జెట్.. 800 పదాల్లోనే
హిరూభాయీ ముల్జీభాయీ
బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలమ్మదే. 2020 ఫిబ్రవరి 1న పద్దులను ప్రవేశపెడుతూ ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాలపాటు మాట్లాడారు. చివరకు ఒంట్లో నలతగా ఉండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. ఇక అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం పూర్తిచేసిన ఆర్థిక మంత్రిగా హిరూభాయీ ముల్జీభాయీ పటేల్ నిలిచారు. 1977లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన తన ప్రసంగాన్ని కేవలం 800 పదాల్లో ముగించారు.
భారతీయత ఉట్టిపడేలా ‘బహీ ఖాతా’

బడ్జెట్ 2018 వరకూ లెదర్ సూట్‌కేస్‌లో పార్లమెంట్‌కు తీసుకొచ్చేవారు. బ్రిటిష్ పాలన కాలం నాటి నుంచీ కొనసాగుతున్న ఆ సంప్రదాయానికి 2019లో నిర్మల తెరదించారు. ఆ ఏడాది తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. వాటి ప్రతుల్ని ‘బహీ ఖాతా’గా పిలిచే ఎరుపు రంగు క్లాత్ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. జాతీయ చిహ్నాన్ని కూడా అమర్చారు. కాబట్టి భారతీయత ఉట్టిపడేలా చేశారు. 2021లో కొత్తగా డిజిటల్ బడ్జెట్‌కు నిర్మల శ్రీకారం చుట్టారు.
ఫిబ్రవరి 1న ఎందుకంటే..

కేంద్ర బడ్జెట్‌ను 2016 వరకూ ఏటా ఫిబ్రవరి చివరి పనిరోజున పార్లమెంటులో ప్రవేశపెట్టేవారు. అయితే దానివల్ల కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీ నాటికి బడ్జెట్లోని అన్ని మంత్రిత్వశాఖలు అమలు చేయడం కష్టమవుతుంది. ఫిబ్రవరి 1న పద్దును ప్రవేశపెట్టిన చరిత్రాత్మక మార్పునకు 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శ్రీకారం చుట్టారు. దీనివల్ల నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే బడ్జెట్‌కు సంబంధించిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తిచేయడానికి తగినంత సమయం అందుబాటులో ఉంది.
- బ్రిటన్ టైంజోన్‌కు అనుగుణంగా.. వలస పాలన సమయంలో మన దేశ బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టేవారు. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా చాలా ఏళ్లు అదే తంతు కొనసాగింది. 1999లో అప్పటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా తొలిసారిగా ఉదయం 11 గంటలకు పద్దును ప్రవేశపెట్టారు. అప్పటి నుంచీ అదే ఆనవాయితీగా కొనసాగుతోంది.
- 2016 వరకు రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టేవారు. 2017 నుంచి కేంద్ర బడ్జెట్లోనే దాన్ని మార్చారు.
ఈనాడు ప్రత్యేక విభాగం