
హైదరాబాద్: భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (కేటీఆర్) తీరు చూస్తుంటే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తన క్యారెక్టర్‌ను బ్యాడ్ చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారని.. కుటుంబ సెంటిమెంట్‌ను పండించడానికి నానా పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. మిగతా వాళ్లకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. గతంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోయారని గుర్తుచేశారు.
‘‘డ్రోన్ కేసులో రేవంత్‌రెడ్డిని 14 రోజుల పాటు జైలు బ్యారెక్‌లో పెట్టి వికృతానందం పొందారు. కనీసం బిడ్డ ఎంగేజ్మెంట్కు కూడా వెళ్లకుండా కోర్టుల్లో అడ్డుకున్నారు. వాళ్లవి కుటుంబాలు కావా? వాళ్లకు కన్నీళ్లు రాలేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీ సొంత చెల్లి కవిత చెబుతున్నారు. వాటికి సమాధానం చెప్పాలి. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నీకు ఏ మంత్రి చెప్పారు? ఏ ఎమ్మెల్యే చెప్పారు. ఆధారాలు చూపించు. ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మాది కాంగ్రెస్ కుటుంబం.. కలిసి మెలిసి ఉన్నాం’’ అని ఆది శ్రీనివాస్ అన్నారు. (తెలంగాణ వార్తలు)