Crime News: మూడుసార్లు అసలైన గోల్డ్‌ ఇచ్చి.. నాలుగోసారి నకిలీ బంగారంతో మోసం


హైదరాబాద్‌: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు బిస్కెట్లు ఇచ్చి అసలు బంగారు నగలను ఎత్తుకెళ్లిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సుమారు కిలో బంగారు నగలను దుండగుడు అపహరించగా.. వాటి విలువ రూ.1.60 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. లక్ష్మీకావ్య అనే మహిళ బంజారాహిల్స్‌లో జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తోంది. కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాచిగూడకు చెందిన శ్రీనాథ్ రాఠీ అలియాస్ అంకిత్ ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఓ ప్రముఖ వ్యక్తికి వ్యక్తిగత సహాయకుడిని(పీఏ) అని చెప్పి నమ్మించాడు. తమ వద్ద భారీగా బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటికి సమానంగా బంగారు నగలు ఇవ్వాలని కోరాడు.

మొదట లక్ష్మీకావ్య అతని మాటలను పట్టించుకోకపోయినా.. పదేపదే సంప్రదించడంతో ఒప్పుకొంది. మూడు సార్లు నిజమైన గోల్డ్‌ బిస్కెట్లు ఇచ్చి నగలు తీసుకెళ్లడంతో అతడిపై నమ్మకం పెరిగింది. ఈ క్రమంలో ఈ నెల 25న కిలో బంగారు నగలను తీసుకున్న శ్రీనాథ్.. తాను బయటకు వెళ్తున్నానని చెప్పి తన సహాయకుడు కృష్ణ ద్వారా బంగారు బిస్కెట్లు పంపిస్తున్నానని తెలిపాడు. అదే రోజు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ వద్ద కృష్ణ బంగారు బిస్కెట్లు అందజేశాడు. బిస్కెట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చిన లక్ష్మీకావ్య వాటిని పరీక్షించగా నకిలీవని తేలింది. శ్రీనాథ్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా ఉండటంతో మోసపోయినట్లు గ్రహించింది. కృష్ణను ప్రశ్నించగా, నాలుగు రోజుల క్రితమే తనను పనిలో పెట్టుకున్నాడని, సోమాజిగూడలోని ఓ హోటల్‌లో వసతి కల్పించాడని తెలిపాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.



Source link

Spread the love