Crime News: రోడ్డు ప్రమాదంలో బావ, బావమరుదుల దుర్మరణం


అశ్వారావుపేట గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో బావ, బావమరుదులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడేనికి చెందిన మడకం సంతోష్‌(19) సోదరితో అదే గ్రామానికి చెందిన పండు సందీప్‌(20)కు ఇటీవల నిశ్చితార్థమైంది. ఇద్దరు కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం చిచ్చోడిగుంపులో బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి స్వగ్రామం వెళ్తున్న క్రమంలో గాండ్లగూడెం శివారులో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో సంతోష్, సందీప్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

అండగా ఉంటారనుకుంటే అనంత లోకాలకు..

మండకం నాగేశ్వరరావు, విజయ దంపతులకు ఒక కుమార్తెతో పాటు కుమారుడు సంతోష్‌ ఉన్నారు. కుమారుడు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. అలాగే పండు నాగేశ్వరరావు, నర్సమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. సందీప్‌ వీరి చిన్న కుమారుడు. వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుటుంబానికి బాసటగా ఉంటున్నాడు. సంతోష్‌ సోదరిని ఏడాదిగా ప్రేమిస్తుండగా త్వరలోనే వీరి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో బావ బావమరుదులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలిని ఎస్సై అఖిల సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Source link

Spread the love