రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన యూపీసీ వోల్ట్
3,800 మందికి ఉద్యోగావకాశాలు
రూ.623 కోట్లతో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
దావోస్‌లో సీఎంతో ఆయా సంస్థల ప్రతినిధుల భేటీ

యూపీసీ వోల్ట్ ప్రతినిధితో కలిసి ఎంఓయూ పత్రాలు చూపిస్తున్న టీజీఐఐసీ ఎండీ శశాంక. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు
ఈనాడు, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మూడోరోజు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం’ పలు కీలక సమావేశాల్లో పాల్గొంది. ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ బృందంతో పలు సంస్థలు పరస్పర అవగాహన ఒప్పందాలు(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ‘యూపీసీ వోల్ట్’ సంస్థ డేటా సెంటర్‌ను స్థాపించడానికి ముందుకొచ్చింది. దీనిద్వారా 3,800 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ‘స్నైడర్’ సంస్థ రూ.623 కోట్లతో తమ యూనిట్ల విస్తరణ ప్రణాళికను ప్రభుత్వం ముందుంచింది.
నెదర్లాండ్స్ సంస్థతో కీలక ఎంఓయూ
దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ఈ మేరకు దావోస్‌లో యూపీసీ వోల్ట్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రెన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌లతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం… ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో.. ఏఐ డేటా సెంటర్ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుపై ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ డేటాసెంటర్ నిర్మాణ దశలోనే 3వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమయ్యాక మరో 800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… ‘‘2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలకపాత్ర పోషిస్తాయి. పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం’’ అని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌ను సన్మానిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రూ.150 కోట్లతో గోద్రెజ్ డెయిరీ ప్లాంట్ విస్తరణ
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గురువారం గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ పెంపకంలో ఏఐ వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రెజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్లతో విస్తరించే అవకాశాలపై చర్చించారు. ఫ్యూచర్ సిటీలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపైనా మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతులు (స్కూళ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సౌకర్యాలు) ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు సూచించారు. నాదిర్ గోద్రెజ్‌ను హైదరాబాద్‌కు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.
సౌర, పవన విద్యుదుత్పత్తిపై ‘ఐనాక్స్’ ఆసక్తి
తెలంగాణను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో తెలంగాణ రైజింగ్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో తొలుత సౌర, పవన విద్యుదుత్పత్తి చేపట్టి, అనంతరం తయారీ రంగంలోకి విస్తరించేందుకు ఐనాక్స్ గ్రూప్ ప్రణాళికలు రూపొందిస్తోంది. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… ‘‘రాష్ట్ర పారిశ్రామిక రంగానికి క్లీన్ ఎలక్ట్రిసిటీని, గ్రీన్ హైడ్రోజన్‌ను అందించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. డేటా సెంటర్లకు అధికస్థాయిలో పునరుత్పాదక విద్యుత్ అవసరం పెరుగుతోంది. తెలంగాణ నూతన ఎనర్జీ పాలసీ కింద అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు.

ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌కు జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు
శంషాబాద్‌లో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ శంషాబాద్, గాగిల్లాపూర్లలోని తమ యూనిట్లను రూ.623 కోట్లతో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో స్నైడర్ కంపెనీ సీఈవో దీపక్‌శర్మ సమావేశమయ్యారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునికీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ భద్రతకు సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలో 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలున్నాయి. ఈ సంస్థ విస్తరణ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయారీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించారు.