Hyderabad: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు | hyderabad-police-arrest-ntv-journalists


మహిళా ఐఏఎస్‌పై కథనం ప్రసారంపై ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న సిట్‌

దొంతు రమేశ్, సుధీర్‌ అరెస్టు.. ఒకరికి నోటీసుల జారీ

ఆ ఛానెల్‌ కార్యాలయంలో సోదాలు.. సీపీయూ స్వాధీనం

ఎన్టీవీ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఈనాడు- హైదరాబాద్‌; న్యూస్‌టుడే, అబిడ్స్‌: మహిళా ఐఏఎస్‌ అధికారిపై కథనాల ప్రసారం కేసులో.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దూకుడుగా ముందుకెళ్తోంది. ఎన్టీవీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ దొంతు రమేశ్‌(52), రిపోర్టర్‌ సుధీర్‌(39)లను మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. అదే ఛానెల్‌ రిపోర్టర్‌ పరిపూర్ణాచారిని అదుపులోకి తీసుకుని బుధవారం సాయంత్రం వరకు విచారించి నోటీసులిచ్చి వదిలేసింది. ఐఏఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఫిర్యాదుతో.. ఈ నెల 10న  హైదరాబాద్‌ సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఎన్‌టీవీ యాజమాన్యం, ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లు, తెలుగు స్క్రైబ్, ఎంఆర్‌ మీడియా తెలంగాణ, ప్రైమ్‌9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్‌ టీవీ తెలుగు, వోల్గా టైమ్స్, మిర్రర్‌టైమ్‌ అఫీషియల్, టీన్యూస్‌ తెలుగు తదితర ఛానెళ్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఎన్టీవీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ దొంతు రమేశ్‌ను రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయం దగ్గర సిట్‌ అదుపులోకి తీసుకుంది. రిపోర్టర్లు సుధీర్, పరిపూర్ణాచారిలను రాత్రి వేళ అదుపులోకి తీసుకుని బషీరాబాగ్‌లోని సీసీఎస్‌కు తరలించింది. ఈ ముగ్గురినీ బుధవారం సుదీర్ఘంగా విచారించింది. సాయంత్రం 6 గంటల సమయంలో పరిపూర్ణాచారికి నోటీసులిచ్చి వదిలేసింది. రాత్రి రమేశ్, సుధీర్‌లను జడ్జి వద్ద హాజరు పరిచేందుకు తీసుకు వెళ్లారు. యాంకర్‌ దేవి నుంచి ఛానెల్‌ కార్యాలయంలో స్టేట్‌మెంట్‌ తీసుకుంది. మంగళవారం రాత్రి ఎన్టీవీ సీఈవో రాజశేఖర్‌ ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. కొన్ని ఛానెళ్లు, యూట్యూబ్‌ ప్రతినిధులకు ఫోన్లు చేసినా స్పందించలేదని తెలిసింది.

పోలీసు సోదాలతో హైడ్రామా

సీసీఎస్‌ ఏసీపీ గురు రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎన్టీవీ కార్యాలయానికి వెళ్లినప్పుడు కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా విచారించేందుకు వచ్చామంటూ భద్రతా సిబ్బందిని తోసుకుంటూ లోపలికి వెళ్లగా.. ఎన్టీవీ సిబ్బంది నిరసన తెలిపారు. పోలీసులు డౌన్‌డౌన్‌ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ‘కథనాలు ప్రసారం చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్లు ఎక్కడున్నాయో చెప్పాలి. విచారణ ఆలస్యమవుతోంది’ అని పోలీసులు సిబ్బందికి చెప్పగా.. వారు తమకు తెలియదని చెప్పారు. ‘చెప్పకపోతే అన్నీ తీసుకెళ్తాం. సర్వర్‌ ఎక్కడుంది..’ అని పోలీసులు మళ్లీ ప్రశ్నించారు. సిబ్బంది ఆందోళనలతో గందరగోళం నెలకొనగా పోలీసులు కొద్దిసేపు బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత లోపలికి వచ్చి కేసు విచారణకు సహకరించాలంటూ అప్పటికప్పుడు ఎన్టీవీ యాజమాన్యానికి లేఖ రాసి ఇచ్చారు. ఛానెల్‌లో ప్రసారమైన కథనానికి సంబంధించి స్క్రిప్టు, ఇతర వివరాల ప్రతులు, ఒక సీపీయూ స్వాధీనం చేసుకున్నారు.


సహకరించకుండా ఎందుకు పారిపోతున్నారు?: సజ్జనార్‌

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు. ఓ విలేకరి ప్రశ్నకు స్పందిస్తూ.. ‘విచారణలో భాగంగా పిలిచినప్పుడు రావాలి కదా..? ఒక జర్నలిస్టు రాత్రి పారిపోయేందుకు ప్రయత్నించారు. సాయంత్రం 5.30 గంటలకు బ్యాంకాక్‌కు టికెట్‌ బుక్‌ చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఇళ్లల్లో సోదాలకు వెళ్లాం. ఛానెల్‌ సీఈవో ఎక్కడున్నారు? తప్పు చేయకపోతే ఎందుకు భయం..? విచారణలో భాగంగా అందర్నీ పిలుస్తాం. ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెడతాం. అరెస్టుల తర్వాత పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం మీద కొందరు విమర్శలు చేస్తున్నారు. నిరంకుశ ప్రభుత్వం, ఎమర్జెన్సీ వచ్చిందని అంటున్నారు. ఎమర్జెన్సీ వస్తే ఇలా మాట్లాడేవాళ్లమా..? అందరూ లోపల ఉండేవారు. దర్యాప్తులో భాగంగా సోదాలకు వెళ్తాం. ముఖ్యమంత్రి మీద అసభ్య పోస్టులు పెట్టిన కేసులోనూ సిట్‌ దర్యాప్తు జరుపుతోంది’’ అని సజ్జనార్‌ వివరించారు.



Source link

Spread the love