ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/బీఆర్క్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్-2026 ప్రారంభం కానుంది. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు సమాచారం. దీంతో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఏపీలో ఎనిమిది, తెలంగాణలో మూడు పరీక్ష కేంద్రాలను పెంచింది. రెండు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరుకానున్నారని అంచనా.
- ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. చివరి రోజు 29న పేపర్-2 జరుగుతుంది. రోజూ ఉదయం 9-12 వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
- ఉదయం షిఫ్ట్‌లో 7.30-8.30 గంటల మధ్య, మధ్యాహ్నం షిఫ్ట్‌నకు 1.30- 2.30 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు.
- అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకొని..దానిపై ఫొటో అంటించాలి. వేలిముద్ర వేయాలి. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు చేసే సమయంలో పేర్కొన్న గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకెళ్లడం తప్పనిసరి.
- పెద్ద బటన్లు ఉండే చొక్కాలు ధరించి వస్తే అనుమతించరు. అడ్మిట్ కార్డులోని నిబంధనలను తప్పనిసరిగా చదవాలని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్ష నిర్వహించే పట్టణాలు/నగరాలు..
- ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది ఉన్న పరీక్ష కేంద్రాలు.. అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. ఈసారి కొత్తగా ఆదోని, అమలాపురం, మదనపల్లి, మార్కాపురం, పుత్తూరు, రాయచోటి, తాడిపర్తి, తిరువూరును చేర్చారు.
- తెలంగాణలో గత ఏడాది వరకు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, హైదరాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈసారి ఆదిలాబాద్, కోదాడ, పెద్దపల్లి కొత్తగా చేరాయి.