
ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. వారితో కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మంలోని అంబేడ్కర్ భవన్‌లో ఆమె దీక్షకు కూర్చున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూదాన్ భూముల బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
ఇవాళ మధ్యాహ్నం బాధితులతో కలిసి జడ్పీ కూడలిలో కవిత ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆమె రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకొని ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చీకటి పడటంతో కవితను పోలీస్‌స్టేషన్ నుంచి పోలీసులు పంపించేశారు. స్టేషన్ నుంచి నేరుగా అంబేడ్కర్ భవన్‌కు చేరుకున్న కవిత దీక్షకు దిగారు. ఇళ్లు కూల్చిన చోటే వెలుగుమట్ల బాధితులకు ప్లాట్లు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆమె తెలిపారు.